(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ భూగృహం నుంచి చంద్రహత్థిని పట్టుకొని వచ్చిన దృశ్యం చూసి పోటిసుని కన్నీళ్లు రక్తం రంగు పులుముకుంటాయి. సైనికులు చాలామంది తనకు వ్యతిరేకంగా మారడంతో ఈసాణుడు పారిపోతుంటాడు. మలయసేహరుడు సైన్యాన్ని వెంటబెట్టుకొని కోట వైపు నడుస్తాడు. తర్వాత…
జంగిటిలో… ‘మహారాణి కన్నుల నిండా ఆకు పసరు పోయించి, కన్నులు తెరవకుండా చేసి, ఆ ప్రణాలానందుడు మాయమైనాడు. మరల రానని చెప్పినాడు. ఇంతకూ వాడు మా అత్త కాని అత్తకు చూపు వచ్చే వైద్యం చేసినాడా? లేక పూర్తిగా గుడ్డిదాన్ని చేసే ప్రయత్నం చేసినాడా?’ అనుకుంటూ చిన్నరాణి… అక్క రూపంలోని భాణుసత్తి కోసం చూసింది. కనిపించలేదు!!!
‘నా పనిలో నేనుండగా ఈ అక్క ఎక్కడికి వెళ్లిందబ్బా…!’ అనుకుంటూ ఇంటిలోనున్న మూడు గదుల్లో చూసింది. కనిపించలేదు! ముందరున్న ఉద్యానవనం లాంటి పూలతోటలోని ప్రతి చెట్టును, తీగను అడిగింది; జాడలేదు! ‘ఎక్కడికి వెళ్లి ఉండవచ్చు…’ అనుకుంటుంటే ఒక ఆలోచన కలిగింది. అది ఆమెను నిలువునా కంపించేటట్లు చేసింది!
‘ఆ ప్రణాలానందుని వెంట వెళ్లలేదు కదా!’ అనుకోగానే ఆమెకు ముచ్చటలు పోసినాయి. ఆనందుడు చెప్పిన రెండు గడియల సమయం అయిపోవచ్చింది
అక్క వెడలిపోయె నెక్కడికో గాని
గడియ గడుచుచుండె క్షణము క్షణము
అత్త కనులు తెరుచు ననుకొను చుండగా
కమలసత్తి తెరిచె కనులు రెండు!!
(అక్క భాణుసత్తి ఎక్కడికి వెళ్లిందో తెలవదు; ఆనందుడు చెప్పిన రెండు గడియల కాలం ప్రతిక్షణం కరిగిపోయి… పూర్తయింది. అతను చెప్పిన ప్రకారం కమలసత్తి కళ్లు తెరిచే సమయం. హఠాత్తుగా ఆమె కళ్లు తెరిచింది)
కమలసత్తి ఒక్కసారిగా కళ్లు తెరవగానే భగ్గున మండినట్లయితే.. అది భరించలేక
“అమ్మా!” అని గట్టిగా అరిచింది.
“అమ్మా! ఏమైంది?” ఒక్కసారిగా ఆలోచనల నుంచి ఉలిక్కిపడి, తేరుకొని అడిగింది ఆహవసత్తి.
“కళ్లు భయంకరంగా మండుతున్నాయే!” అన్నది కన్నీరు ధార కట్టగా కమలసత్తి.
‘నిజమే! నా ఆలోచన సరైనదే! ఆనందుడు పైకి కనిపించేంత ఉత్తముడు కాదు! మహారాణి గారికి కళ్లు పూర్తిగా కనిపించకుండా చేసి, వాడు కనబడకుండా పోయినాడు! పోతూ పోతూ మా చిన్న రాణిని కూడా తీసుకొని పోయినాడు!!’ అనుకుంటుంటే దుఃఖం ఆగలేదు ఆహవకు.
“అమ్మా! నేను ముందే అనుకున్నా, ఆ ఆనందుడు ఇటువంటిదేదో చేస్తాడని! వాడు పాపాత్ముడు! నీచుడు! దుర్మార్గుడు…!” ఇంకా ఏదో అంటుండగానే అడ్డుకున్నది కమల…
“ఏయ్! నా బిడ్డను ఏమీ అనకు! అతను ఉత్తముడు! తప్పంతా నాదే!” అన్నది.
‘హుఁ! ఇప్పటికైనా గ్రహించినావు తల్లీ! కానీ ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నావు…’ అని తనలో తాను గొణుక్కున్నది.
ఈ మాటలు వినలేదు కమలసత్తి.
“అతను ‘హఠాత్తుగా కళ్లు తెరవకూడదు!’ అన్నాడు కదా!” గుర్తు చేసుకుంటూ అన్నది.
“రెండు గడియలు గడిచిన తర్వాత చన్నీళ్లతో మూడుసార్లు కళ్లు కడుక్కొని, ఆపై నెమ్మది నెమ్మదిగా తెరవమన్నాడు. చన్నీళ్లు ఎక్కడున్నాయి?” అడిగింది ఆహవను.
‘ఓహో! నీకు ఇంకా ఆశ చావలేదన్నమాట! ఆ వంచకుని మీద నమ్మకం చెదిరిపోలేదా…’
“ఆహవా…!” గట్టిగా అన్నది. అంతకుముందు తన మాటలు వినలేదేమో అనుకొని కమలసత్తి.
“ఆఁ…! అత్తమ్మా! ఇక్కడే ఉన్నా!” కంగారును కప్పిపుచ్చుకుంటూ మంచం వద్దకు పరుగెత్తి, ఆమెను పైకెత్తి చన్నీటి కుండ వద్దకు తీసుకొని పోయింది.
ముంతతో చేతుల్లో చల్లటి నీళ్లు పోసింది. ఆ నీళ్లను మొఖానికి చల్లుకొని కళ్ల మీదుగా మృదువుగా రుద్దుకున్నది కమలసత్తి. అట్లా రుద్దుకుంటూ ఉంటే ఆమె బాధ ఉపశమించి, హాయిగా అనిపించ సాగింది. మూడుసార్లు అలా చేయగానే కళ్ల మంట పూర్తిగా తగ్గింది కానీ, కనుల లోపల ఏదో కొంచెం నొప్పి తెలుస్తున్నది. గబుక్కున తెరిస్తే మళ్లీ ఇంతకుముందు లాగానే ఇబ్బంది ఏర్పడుతుందని…
“నన్ను గుమ్మం వద్దకు తీసుకొని పో! అక్కడనే నేను మొదటిసారి నా బిడ్డ ఆనందుని గురించి విన్నాను! అక్కడ వాడు ఉన్నాడనుకొని కనులు తెరుస్తాను! నాకు చూపు వస్తుంది! నా ఆనందుడు కూడా వస్తాడు…” అంటుంటే ఆమె ముఖంలో కోటి కాంతులను దర్శించింది ఆహవ.
‘ఆహా! ఆశ మనిషిని ఎంత ఆనంద సముద్రంలో ఓలలాడిస్తుందో; అది నెరవేరనప్పుడు అంతటి దుఃఖ సాగరంలోనూ ముంచెత్తుతుంది కదా!’ అనుకుంటూ ఆమెను గుమ్మం వద్దకు నడిపించుకుని పోయింది ఆహవసత్తి.
అక్కడ ఎవరూ లేరు! గుమ్మానికి ఎదురుగా ఆమెను నిలబెట్టి, ఆమెకు అభిముఖంగా, కొంచెం వారగా నిలబడి కనులు తెరవనున్న కమలసత్తి ముఖాన్ని తదేకంగా గమనిస్తున్నది ఆహవసత్తి.
క్రమక్రమంగా… నెమ్మది నెమ్మదిగా… కనులు తెరిచింది కమలసత్తి.
“అదేమీ! నా కోడలు రోహాదేవి పురుషాకారంలో కనిపిస్తున్నది?!” తనలో తాను అనుకుంటున్నట్లే బయటికి అనేసింది.
ఆ మాటలు వింటున్న ఆహవకు ఒకసారిగా ఒళ్లు జలదరించింది. ‘ఈ పెద్దరాణికి చూపుతోపాటు మతికూడా పోయిందా ఏమి?’ అనుకుంటూ, భయం భయంగా వెనుకకు తిరిగి చూసి కొయ్యబారి పోయింది!
చిలుకవాడలోని భూగృహం బయట అలక్కుని చేతిలో విలవిల లాడుతున్న చంద్రహత్థిని చూసిన పోటిసునిలో ఆవేశం కట్టలు తెంచుకున్నది.
“చంద్రా!” అంటూ మరోమారు అరిచినాడు!
అది అడవిలో సింహ గర్జనలా వినిపించింది.
అలక్కుడు ఆ శబ్దానికి జడుసుకొని ఠక్కున చంద్రహత్థిని వదిలినాడు. యుగయుగాల ఎడబాటు అంతరించిందన్న ఆనందం తన ప్రియురాలి దుస్థితిని చూసి మహావేశంగా మారింది!
ఒంట్లోని బలాన్ని అంతా కూడ తీసుకొని, కట్టేసిన చేతులను తన స్వాధీనంలోనికి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినాడు పోటిసుడు!
బిగుసుకున్న అతని ఉక్కు నరాలను ఎదిరించలేని గొలుసులు పురికొసల్లా పుటుక్కు పుటుక్కున తెగిపోయినాయి! తనను కట్టేసిన స్తంభాన్ని అట్లే వెనుకబాటుగా పట్టుకొని పైకెత్తి అలక్కుని పైకి విసిరినాడు. అనూహ్యమైన ఈ పరిణామం అక్కడున్న వాళ్లందరినీ చకితులను చేసింది. ఆ మహా బలవంతుని చర్య వాళ్లకు ఒక పట్టాన అర్థం కాలేదు!
పోటిసుడు విసిరిన ఆ స్తంభం సరిగ్గా వాని తలకు తగిలి, వాడు పది గజాల దూరంలో ఉన్న చెట్టుకు కొట్టుకున్నాడు. వాని తల స్తంభానికి చెట్టుకు మధ్యన పచ్చడి అయ్యి, అక్కడికక్కడే చచ్చి పడిపోయినాడు.
అప్పటికే పోటీసుని మాటలతో ప్రభావితులైన సైనికులు అతని భీమ బలం చూసి విస్మయానంద వశులై అప్రయత్నంగా జయ జయ ధ్వానాలు పలికినారు! మిగిలిన వాళ్లు కూడా వాళ్లతో గొంతు కలిపినారు! పోటిసుణ్ని చూసిన చంద్రహత్థి ఒక్కక్షణం అది నిజమో! కలనో! తేల్చుకోలేక పోయింది.
‘నా మొగుడు… నా కోసం… నా కళ్లముందు…’ అనుకుంటూ సంధించి వదిలిన బాణంలో అతని వద్దకు చేరుకున్నది. అంతలోనే ఆ రూపం చూసి ఆగిపోయింది. అప్పుడే సవరసత్తి..
“ఇంకా ఏం చూస్తున్నారురా శుంఠల్లారా! నా కట్లు విప్పేయండి!” అన్నది, పక్కనే ఉన్న సైనికులను చూసి. వాళ్లు స్పృహ తెచ్చుకొని, గబగబా కట్లు విప్పినారు.
ఆమె చంద్రహత్థీ-పోటిసుల వైపు కదులుతూ…
“చంద్రా! ఇదంతా చూసి కూడా నువ్వు నీ ప్రాణేశ్వరుణ్ని పోల్చుకోలేక పోవడం చిత్రంగా ఉంది! రూపం చూసి కలవరపడకు! అతను నీ ప్రియుడు…! నీ భర్త…! నీ ప్రాణం…! పోటిసుడే!!! అదంతా మా రూపశిల్పి గొప్పతనం! ఒక్కసారి తాకి చూడు! అతను పోటిసుడో… కాదో… నీకే తెలుస్తుంది!” అన్నది.
మరుక్షణం అతణ్ని తీగలా అల్లుకుపోయింది చంద్రహత్థి. ఆమెను గుండెకు గట్టిగా హత్తుకున్నాడు పోటిసుడు.
“ఎవరు నువ్వు?”
ముందుగా ఆ కొత్త వ్యక్తిని గమనించిన భాణుసత్తి అడిగింది.
“ఆ సంగతి నీ ప్రియుణ్ని అడుగు!” అన్నాడు నిర్మలానందుడు, నిశ్చలంగా సాధనానందుని… అదే ఆనందుని… ప్రణాలానందుని వైపు చూస్తూ.
నిర్మలానందుని చూడగానే ఉలిక్కిపడి, భాణుసత్తికి దూరంగా జరిగినాడు ప్రణాలుడు.
ఇద్దరినీ మార్చిమార్చి చూసింది భాణు.
“ఎవరీతడు?” ప్రణాలునితో అన్నది.
“చెప్పరా! అడుగుతున్నది కదా! నీ ఆశల పల్లకి! కోరికల కోడెనాగు…! సమాధానం చెప్పు!” అన్నాడు కనుబొమలు ఎగరేస్తూ నిర్మలానంద.
వెంటనే నోటమాట రాలేదు ప్రణాలునికి.
“ఊఁ…చెప్పు!” నిర్మలానందుడు, భాణుసత్తి ఒకరికి తెలియకుండా మరొకరు ఒకేసారి అన్నారు!
“ఇతను… ఇతను… నా మిత్రుడు… నిర్మలానంద!” మాటలను పేర్చుకుంటూ ఇట్లా కొనసాగించినాడు ఆనందుడు..
“మనం వెళ్లాలనుకున్నది ఇతని వద్దకే!”
“నా వద్దకా?” నమ్మలేకపోయినాడు నిర్మలానందుడు.
“అంటే… గురువుగారైన ఆచార్య మాధవుని వద్దకు వెళుతున్నాం! అక్కడ నా ప్రియమిత్రుడు నిర్మలానందుడు ఉంటాడు! అతనే… ఇతను!” అన్నాడు తడబాటును కప్పిపుచ్చుకుంటూ.
“ఓహో! అట్లా వచ్చినావా! సరే.. ఇప్పుడు చెప్పు! ఈ కోరికల గుర్రం ఎవరు? ఎందుకు ఇట్లా అడ్డదారిని మీరు పరుగులు పెడుతున్నారు?” అని అడిగినాడు నిర్మలానందుడు.
“ఈమె పేరు భాణుసత్తి!” తలవంచుకొని అన్నాడు ప్రణాలానందుడు.
“ఎవరీ భాణుసత్తి? ఈమె నీ వెంటపడిందా…? లేక నీవు ఈమె వెంట పడ్డావా…?” నిశితంగా నిర్మలానందుడు.
“జంగిటిలో పరిచయమైంది! నేనే కావాలనుకుంటున్నది! నేను కాదనలేక…” అసంపూర్ణం అతని వాక్యం.
పరిశీలనగా చూస్తూ అన్నాడు నిర్మలానంద…
“చూస్తుంటే ఈమె కులస్త్రీ వలె ఉన్నది! సంపన్న కుటుంబానికి చెందినది అనిపిస్తున్నది!”
“అవును! నాకు పెళ్లయింది! సంపన్నురాలినే! మాకు కోరికలు ఉండవా? మేము ప్రేమించడానికి అర్హులం కామా?” లజ్జ విడిచి సూటిగా అడిగింది భాణుసత్తి.
“కోరికలు ఈ సృష్టిలో గాలిలా అంతటా వ్యాపించి ఉంటాయి తల్లీ! మనుషుల్లో కొంచెం అధికం! కట్టుబాట్లను గౌరవించని వాళ్లలో అనంతం!!” నిర్మలానంద…
“ఇంతకూ మీరు ఒకరికొకరు పూర్తిగా పరిచయమైనారా? లేక అదికూడా అసంపూర్ణం, అసమగ్రమేనా?”
“నా పేరు భాణుసత్తి! అసలు పేరు రోహాదేవి!”
“జంగిటిలో మీరు ఏం చేస్తుంటారు?”
“ఏమీ చేయను! అసలు మాది జంగిటి కాదు!”
“మరి???”
“నేను పుట్టింది మల్లికాగిరిలో; కాపురానికి వచ్చింది పోదనకు!”
“ప్రేమ కోసం జంగిటికి వచ్చినారా?”
“లేదు! ఒక ప్రమాదం మమ్మల్ని జంగిటికి తెచ్చింది!”
“ఏమిటో ఆ ప్రమాదం? అది అక్కడికే ఎందుకు తెచ్చిందో!?”
“తెలవదు!”
“మీకు తెలిసింది చెప్పండి!”
“పోదనలో నేను కుసుమ శ్రేష్ఠి కోడలిని. ఒకరోజు ప్రమాదవశాత్తు మా కోటకు మంటలు అంటుకున్నాయి. ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించేందుకు మా కువిందు తాత మమ్ములను జంగిటికి పంపించినారు. మేము వచ్చినం; ఆయన వస్తానని చెప్పి రాలేదు! అంతకుముందే దేశాంతరం వెళ్లిన మామగారు; ఆయనను వెతుక్కుంటూ వెళ్లిన మా ఇంటి పనివాడు; మా వారు… ఎవరూ తిరిగి రాలేరు!”
“ఈ చరిత్రంతా మా సాధనానందునికి… అదే ఈ ప్రణాలానందుడికి… మీ ప్రియా నందుడికి… తెలుసా?”
“తెలవదు! అతనికి తెలుసో తెలవదో నాకు తెలవదు! ఎప్పుడూ అడగలేదు; నేను చెప్పలేదు!”
“పోనీ… తన గురించి నీకు తెలుసా?”
తల అడ్డంగా ఊపింది ఆమె.
“ఏం మిత్రమా! చెప్పలేదా?”
తలవంచుకున్నాడు ప్రణాలుడు.
“చెప్పు…! ఇప్పుడైనా చెప్పు!”
“నేను ఆచార్య మాధవుని శిష్యుడను!” అంటూ, ఏదో చెప్పబోయినాడు ప్రణాలుడు.
“కాదు! కాదు! ప్రణాళుడిగా ఉన్న నాటినుంచి… నీ చిన్ననాటి నుంచి… నీ కథంతా చెప్పు మిత్రమా!” అన్నాడు నిర్మలానంద.
తప్పనిసరిగా… తప్పనిసరి అనిపించి, తనకథ వివరించినాడు సాధనానందుడు… ఆనందుడు… ప్రణాలానందుడు.
తానొక కాముకుడినని; ఒంటరి ఆడవాళ్లను వెతికి పట్టుకొని వాళ్లతో గడపడం తనకు అలవాటని; కుంతాల జలపాతం వద్ద రోహాదేవిని మొదటిసారి చూస్తూ దొరికిపోయినానని; రాజు వద్ద జరిగిన అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఒక అంధ కూపంలో దూకినానని; ఆచార్య మాధవుడు తనను కాపాడినాడని; ఎవరో ఇద్దరు స్త్రీలు కూడా అందుకు సహకరించినారని; ఆ తర్వాత సాధనానందుడుగా మారి… దేశాటనలో భాగంగా జంగిటికి చేరే దాకా… అంతా చెప్పినాడు. కొన్ని నిమిషాల తర్వాత…
భాణుసత్తి అనే రోహాదేవి తన నిర్ణయం ప్రకటించింది!
అది విని ఆ ఇద్దరు మిత్రులూ ఉలిక్కిపడ్డారు!
(సశేషం)
దోరవేటి
89788 71961