ఆదిలాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించకపోవడంతో ఎదురుచూపులే మిగులుతున్నాయి. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలోని అభివృద్ధి పనుల ప్రస్తావన లేకపోవడంతో ప్రజలు మరోసారి నిరాశకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్నూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్, విమానాశ్రయం, సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభం, హైదరాబాద్-నాగ్‌పూర్ కారిడార్, గిరిజన యూనివర్శిటీ, టైక్స్‌టైల్ పార్కు ఏర్పాటు వంటి విషయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటికి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండేళ్లుగా వీటిని బడ్జెట్లో గుర్తించకపోవడం జిల్లావాసులను అసహనానికి గురి చేస్తున్నది. జిల్లాలోని ప్రాజెక్టుల విషయంలో ముందడుగు వేయకపోవడంతో జిల్లా అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల హామీలు ఏమయ్యాయి
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అ భ్యర్థులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయనే విమర్శ లు వస్తున్నాయి. గతంలో బీజేపీ కేంద్ర మంత్రులు సిమెంటు పరిశ్రమ విషయంలో సానుకూలంగా స్పందించారు. సీసీఐని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వ యాన కేంద్ర మంత్రులు ప్రకటించిన సిమెంటు పరిశ్రమకు మోక్షం లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అభివృ ద్ధి పనులు ప్రారంభమైతే జిల్లావాసులకు ప్రయోజనం చేకూరుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ల భిస్తుంది. వీటితోపాటు ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యం, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడుతాయి.
ఆదిలాబాద్ జిల్లాపై కేంద్రం చిన్నచూపు
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. సిమెంటు పరిశ్రమను ప్రారంభించడానికి అవసరమైన వనరులు ఉన్నాయి. సిమెంట్ వినియోగం పెరుగుతుండడంతో డిమాండ్ బాగా ఉంది. వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐని ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా ఫలితం లేదు. రైల్వేలైన్, విమానాశ్రయం విషయంలో కేంద్రం స్పందించడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీతోపాటు నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలున్నా బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం శోచనీయం.
– నారాయణ, ఆదిలాబాద్
వనరులున్నా నిర్లక్ష్యం
బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మూతబడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. సీసీఐలోని 700లకు పైగా ఎకరాల స్థలంలో లైమ్స్టోన్తోపాటు ఇతర ముడిసరుకు, నీటి సౌకర్యంతోపాటు జాతీయ రహదారి ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌కు చెందిన వ్యాపారులు దూరప్రాంతాల నుంచి సిమెంట్‌ను కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. దీంతో వినియోగదారులు ధర ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. సిమెంటు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడనాడి పరిశ్రమ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి.
– యానిస్ అక్బానీ, ఆదిలాబాద్
రైల్వేలైన్‌కు నిధులు కేటాయించాలి
జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తున్నారు. రైలుమార్గం ద్వారా హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు పోయే అవకాశం ఉంటుం ది. వ్యాపారులకు రైలు సౌకర్యం ఉపయోగక రంగా ఉంటుంది. ప్రయాణభారం తగ్గడంతో పాటు సరుకుల రవాణ సులభంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రైలు మార్గం ఏర్పాటు కోసం బడ్జెట్లో నిధులు మంజూరు చేయకపో వడం బాధాకరం. ప్రజల అవసరాలను గుర్తించి రైలుసౌకర్యం కల్పించాలి.
– గండ్రత్ సంతోష్, ప్రధాన కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్, ఆదిలాబాద్
కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్
తాండూర్, ఫిబ్రవరి 2 : కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక, ఆర్థిక సంసరణల కొనసాగింపే ఈ బడ్జెట్ అని సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దాగం రాజారామ్ ఆరోపించారు. తాండూరు మండలంలోని నర్సాపూర్‌లో ఆదివారం సీపీఎం, ఏఐకేఎంస్, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యలో బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.3 లక్షల కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ జీడీపీ లోటు 4.4 శాతంగా చూపడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడనున్నదని విమర్శించారు.
బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐని వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యుత్ సంసరణలను చేపట్టక పోవడం వికసిత్ భారత్ బడ్జెట్ కాదు ఇది కార్పొరేట్ సంస్థల బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. బడ్జెట్ పునఃపరిశీలించి పెట్రోల్, డీజిల్‌పై పన్నులు రద్దు చేయాలని, అను ఇంధన సంస్థలను ప్రైవేటీకరించవద్దని, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సంసరణలను వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కేంద్ర పథకాలకు నిధులు పెంచాలని, సీం వరర్లను కార్మికులుగా గుర్తించాలని, ధరల స్థిరీకరణకు బడ్జెట్ లో నిధులు పెంచాలని, విభజన హామీల అమలుకు బడ్జెట్ కేటాయించాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం బీహార్‌కు వరాలు తెలంగాణకు మొండి చేయి చూపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.