తాండూర్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన లేబర్ కోడ్ ( Labor Code ) లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాలను సవరించాలని సీఐటీయూ( CITU ) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్త బ్లాక్ డే నిరసనలలో భాగంగా మండల కేంద్రం ఐబీలో నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ కోడ్లతో సమ్మె చేసే హక్కును, పని గంటలను, సామాజిక భద్రతను దెబ్బతీస్తాయని ఆరోపించారు. విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ..రామ్ జీ చట్టం, విత్తన నల్ల చట్టాల సవరణ బిల్లు, ఎల్ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకార నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, కార్మిక, ప్రజా, రైతు, వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్లెంలో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కే లీలారాణి, సత్యవతి, కె విజయలక్ష్మి, ఎం విజయలక్ష్మి, బి విజయలక్ష్మి, సుజాత, బీ లీలారాణి, మగ్దూం, కార్మికులు పాల్గొన్నారు.