తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామం హనుమాన్ కాలనీ మహిళలు గురువారం తాగునీటి కోసం ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి ( National Highway ) పై ఖాళీ బిందెలతో నిరసన తెలిపి గ్రామపంచాయతీ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, మహిళలు మాట్లాడుతూ గ్రామంలోని హనుమాన్ కాలనీ ( Hanman Colony ) లో నెల రోజులుగా డైరెక్ట్ పంపింగ్ మంచి నీటి బోర్వెల్ చెడిపోయి నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీ అధికారులను నిలదీయగా పంచాయతీలో నిధులు లేవని సొంత నిధులతో మరమత్తులు చేయించుకోవాలని పంచాయతీ అధికారి పేర్కొనడాన్ని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో మాజీ ఉపసర్పంచ్ రౌతు వెంకటేశం అక్కడికి చేరుకుని నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు.