మందమర్రి, సెప్టెంబర్ 20 : రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పద్మావతి కాలనీలోగల గద్దెరాగడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పద్మావతి కాలనీలోని ఓ అద్దె ఇంటిలో మహ్మద్ మొయిన్-అవంతి అనే దంపతులు మంచిర్యాలలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన సత్తమ్మ అనే మధ్యవర్తి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఒక్కో విటుడి నుంచి రూ. 1500 తీసుకుంటున్నారు. అమ్మాయిలను పంపించే సత్తమ్మ రూ. 500, గృహం నిర్వహిస్తున్న దంపతులు రూ. 500, మిగతా రూ. 500 సదరు మహిళకు ఇస్తారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన ఓ మహిళకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆశచూపి వ్యభిచారం చేసేందుకు ఇక్కడికి పిలిపించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి రూ. 1500, ఐదు మొబైల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్ బాక్స్‌లను సీజ్ చేశారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు పంపిచారు. మహ్మద్ మొయిన్, అవంతి దంపతులు, పత్తి సత్తమ్మ, మంచిర్యాలకు చెందిన విటుడు ఆకునూరి సంపత్‌ను అరెస్ట్ చేశారు.