ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 15 : సిర్పూర్ పేపర్ మిల్లు ప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సమస్యలను సామరస్యంగా పరిషరించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి సిర్పూర్ పేపర్ మిల్లు ప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపి పరిషరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సిర్పూర్ పేపర్ మిల్లు ప్రతినిధులు స్థానిక లారీ యజమానులకు పని కల్పించాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇరువర్గాలు సమన్వయంతో చర్చించుకొని రవాణా ధరలను నిర్ణయించుకోవాలని, మిల్లు అభివృద్ధితో పాటు లారీ యజమానులు లబ్ధి పొందేలా సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్ డీఎస్పీలు రామానుజన్, కరుణాకర్, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం ప్రతినిధులు, లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.