ఎదులాపురం, మార్చి 30 : ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలను ఆపే అధికారం లేదని, అలా చేసిన ఒక ఎంవీఐ అధికారి ప్రైవేట్ డ్రైవర్ యుగందర్పై కేసు నమోదు చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం భోరజ్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఒక ఎంవీఐ అధికారి ప్రైవేట్ డ్రైవర్ యుగందర్ ప్రైవేటు వ్యక్తి వాహనాలు ఆపి ధ్రువపత్రాలు అడగ్గా హైవే పెట్రోల్ గమనించి జైనథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు.. చెక్ పోస్టు, టోల్ ప్లాజాల వద్ద ప్రైవేటు వ్యక్తులు, అధికారుల ప్రైవేట్ డ్రైవర్లు వాహనాల ఆపడానికి, తనిఖీలు చేయడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. ఇక నుంచి ఏ శాఖ అధికారికి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు అనధికారంగా వాహనాలు ఆపిన, తనిఖీలు చేసిన, సంబంధిత అధికారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారని తెలిపారు.