లోకేశ్వరం, నవంబర్ 1 : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిని చితకబాదిన ఘటన శనివారం చోటు చేసుకున్నది. బాధిత విద్యార్థిని తండ్రి సాయన్న వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో నా కూతురు శృతిక రెండో తరగతి చదువుతున్నది. శుక్రవారం తోటి విద్యార్థినితో గొడవ పడగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్‌లోకి పిలుచుకొని తీవ్రంగా కొట్టింది.
ఆ సమయంలో బాలిక దుస్తుల్లో మూత్ర విసర్జన చేసుకున్నది. దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో రాత్రంతా జ్వరంతో బాధపడింది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశా. కాగా.. పాఠశాల ప్రిన్సిపాల్ నవ్యను వివరణ కోరగా.. విద్యార్థినిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డస్టర్‌తో కొట్టడంతో తలకు గాయమైంది. ఇట్టి విషయమై ఎంఈవో చంద్రకాంత్‌ను వివరణ కోరగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.