ఆదిలాబాద్, మే 21(నమస్తే తెలంగాణ) ః మరో 20 రోజుల్లో వానకాలం ప్రారంభం కానుండడంతో ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది భారీ వర్షాల కారణంగా పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ప్రధాన రహదారులతోపాటు వార్డుల్లోని రోడ్లు, ఇండ్లలోకి వర్షం నీరు ప్రవహించడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీలను వరద నీరు చట్టు ముట్టడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆదిలాబాద్ పట్టణంలోని జీఎస్ ఎస్టేట్, దుర్గానగర్, సుభాష్‌నగర్, కోజాకాలనీ, మణిపూర్ కాలనీ, ఖానాపూర్, రాంనగర్, కుమ్మరికుంట, గ్రీన్‌సిటీ, చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీలు నీటిలో మునిగాయి. వరద ప్రవాహానికి రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నివారణ చర్యలు చేపడుతామన్నారు.
మరో 20 రోజుల్లో వానకాలం ప్రారంభంకానుంది. భారీ వర్షాల కారణంగా గతేడాది మాదిరి పట్టణంలో పలు కాలనీల్లోకి వరదనీరు ప్రవహించే ప్రమాదం ఉంది. గతేడాది వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నివారణ చర్యలు చేపట్టలేదు. వివిధ శాఖల అధికారులతో కూడిన బృందాలు కాలనీల్లో పర్యటించి వరదనీటి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు చేశారు. కాలనీల్లో చేపట్టాల్సిన పనులపై రూ.59.47 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఏడాది గడుస్తున్న వరద ప్రభావిత ప్రాంతాల్లో చేయాల్సిన పనులకు సీడీఎంఏ నుంచి ఆమోదం లభించలేదు. యూడీఎఫ్ నిధులు రూ.18.70 కోట్లు ప్రతి వార్డుకు కేటాయించగా, టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.30 కోట్లతో విలీన కాలనీల్లో అభివృద్ధి పనులకు కేటాయించారు. దుర్గానగర్, కోజా కాలనీ, మణిపూర్ కాలనీల్లో నాలాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసినా టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగుతున్నది. పలు కాలనీల్లో హై లెవల్ వంతెనలు, వరదనీటిని మళ్లీంచడానికి పనులు చేపట్టాల్సి ఉండగా వాటికి ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా మరోసారి తాము వరదనీటితో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నదని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.