నిర్మల్ జిల్లాలో 300 మంది లబ్ధిదారుల ఎంపిక
పారదర్శకంగా అర్హుల గుర్తింపు.. మార్చిలో గ్రౌండింగ్..
ప్రతి సెగ్మెంట్‌కు 100 యూనిట్లు.. ఒక్కొక్కరికీ రూ.10 లక్షలతో భరోసా..
మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమక్షంలో పక్కాగా లబ్ధిదారుల ఎంపిక
నిర్మల్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) :శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు సీఎం కేసీఆర్ నడుంబిగించారు. దళితుల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి, ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించడానికి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా.. సెగ్మెంట్‌కు వంద చొప్పున 300 మందిని పక్కాగా, పారదర్శకంగా ఎంపిక చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ సభకు పెట్టి లబ్ధిదారులను గుర్తించారు. అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయనుండగా.. ఇప్పటికే నిర్మల్ జిల్లాకు రూ.5 కోట్లు వచ్చాయి. మార్చి నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తి కానుండగా, వ్యక్తిగత యూనిట్లతోపాటు సామూహిక యూనిట్లను కూడా ఇవ్వనున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఫిబ్రవరి మొదటి వారంలోగా అర్హులను ఎంపిక చేసి, మార్చి చివరి వారంలో యూనిట్లు పంపిణీ చే యాలని సర్కారు నిర్దేశించింది. ఈ మే రకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు నిర్మల్ కలెక్టర్ ప్రత్యే క దృష్టి సారించారు. వీరి ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. నిర్మల్ జిల్లా పరిధిలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గానికి 100మంది చొప్పున 300 మందిని ఎంపిక చేశారు. అధికారులు కూడా ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే నిర్వహించి లబ్ధిదారుల ధ్రువపత్రాల పరిశీలన, విద్యాభ్యాసం వంటి వివరాలను సేకరించారు. అలాగే వారి జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల మేరకు ఎలాంటి యూనిట్లతో ప్రయోజనం ఉంటుందో వివరించనున్నారు. మార్చి నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తి కానుండగా, వ్యక్తిగత యూనిట్లతోపాటు సామూహిక యూనిట్లను కూడా ప్రోత్సహించనున్నారు.
238 మంది ఎంపిక
నిర్మల్, ముథోల్ నియోజకవర్గంలో 100 మంది చొప్పున 200మందితో అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఇందులో ఖానాపూర్ నియోజకవర్గం నిర్మల్‌తోపాటు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోకి వస్తుంది. 100 మందిలో నిర్మల్ జిల్లా పరిధి నుంచి 38 మందిని ఎంపిక చేసి.. మిగతా 62 మందిని ఆయా జిల్లాల నుంచి తీసుకున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్ల కేటాయింపుపై అవగాహన కల్పిస్తున్నారు. అనుభవం, నైపుణ్యత వంటి అంశాలను పరిగనలోకి తీసుకొని యూనిట్లను కేటాయించనున్నారు. రూ.10లక్షల యూనిట్ల విషయంలో లబ్ధిదారుడి ఇష్టానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వనుండగా.. వారికి సరైన అవగాహన లేకపోతే దళిత మేధావులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేయనున్నారు.
దళితబంధు కింద ఎంపిక చేసిన గ్రామాలు..
ఖానాపూర్ నియోజకవర్గపరిధిలోని ఎనిమిది గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో దస్తూరాబాద్ మండంలోని దేవునిగూడెం.. కడెం మండలంలోని బెల్లాల్, నర్సాపూర్.. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, సత్తెనపెల్లి, తార్లపాడ్.. పెంబి మండలంలో అంకెన, తులసిపేట్ గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో 38 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు.
నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని మామడ మండలం కిషన్రావుపేట్, లింగాపూర్, రాసిమెట్ల, పాంగ్రా.. నిర్మల్ రూరల్ మండలంలోని లంగ్డాపూర్, ఎల్లపెల్లి.. సారంగాపూర్ మండలంలోని ఆలూర్.. సోన్ మండలంలోని సాకెర గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల పరిధిలో అర్హులైన వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ముథోల్ నియోజకవర్గం బాసర మండలంలోని సుర్లి.. భైంసా మండలంలోని మాంజ్రి.. కుభీర్ మండలంలోని కుఫ్టి.. లోకేశ్వరం మండలంలోని ఎడ్దూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోని వంద మంది దళిత కుటుంబాలకు మేలు జరుగనుంది.
మార్చి 15లోగా గ్రౌండింగ్ పూర్తి చేస్తాం..
నిర్మల్ జిల్లాలో దళితబంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపి క చేశాం. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఎంపిక చేసిన లబ్ధిదారులకు వచ్చే మార్చి 15లోగా యూనిట్లను పంపిణీ చేస్తాం. ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. మిగతా నిధులు త్వరలోనే రానున్నాయి. పథకం అమలులో లోటుపాట్లు లేకుండా చూస్తాం.- నిర్మల్ కలెక్టర్, ముషారఫ్ అలీ ఫారూఖీ