చెన్నూర్, జూలై 16: చెన్నూర్ పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను గురువారం స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చెన్నూర్ పట్టణ ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్ మాట్లాడుతూ ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్గా పని చేసిన మురళీకృష్ణ అవినీతి అరోపణలతో బదిలీ కాగా, తాము ప్రజల పక్షాన సంబురాలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యామని, అం తలోనే తమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అవినీతిపై నిరసన తెలిపే స్వేచ్ఛ లేదా…? సీఎం రేవంత్రెడ్డి గారూ.. అంటూ ఆయన ప్రశ్నించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామికి చెడ్డపేరు వస్దుందనే నెపంతోనే ఈ అణచివేత అని ఆయన ఆరోపించారు. అక్రమ అరెస్టులతో నిజాలను దాచలేరని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యలపై పోరాటం ఆపబోమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు మానిశెట్టి శ్రీనివాస్, నిమ్మల సంతోష్, బోగె భారతి, దిల్షాద్, రవి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.