సోన్, మే 22 : రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంతో జాప్యం చేయవద్దని నీటి పారుదల శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్, నిర్మల్ మండలంలోని బొప్పారం, రత్నాపూర్‌కాండ్లీ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్‌తో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. తరుగు తీస్తున్నారా అని తెలుసుకున్నారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం వేయాలని, సేకరించిన ధాన్యాన్ని లారీలలో లోడ్ చేయించి రైస్‌మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావుల్లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
1,02,689 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం.. : కలెక్టర్
జిల్లావ్యాప్తంగా 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 1,02,698 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు, క్లినింగ్ మిషన్, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, సివిల్ సప్లయ్ అధికారిణి నందిత, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎం శ్రీకళ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఏడీ మార్కెటింగ్ అశ్వక్, డీసీవో నర్సయ్య, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానంద్ పాల్గొన్నారు.