చిక్కడపల్లి, మార్చి 21 : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం రంగాలకు అధిక నిధులను కేటాయించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వంటి ప్రాధాన్యతా రంగాలకు నిధులు పెంచాలని, లేదంటే ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన బడ్జెట్‌పై రౌంట్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ పాపారావు అన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటనీ, దీంతో ఇక్కడి ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నాయని చెప్పారు.
సంపదను పంపిణీలో తీవ్ర అసమానతలు ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే రూ.3.49 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఈ సారి బడ్జెట్లో రూ. 82 వేల కోట్ల అప్పు చేయబోతున్నట్లు పొందుపర్చారని, విపరీత అప్పులు ప్రమాదకరమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయక పోగా, 65వేల ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమంగా తొలగించాలని ఈ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణ కాపాడుకోవడానికి మారోసారి ఉద్యమాలు చేయాల్సిన అవసరం నెలకొందన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 12 నుంచి13 శాతం నిధులు కేటాయించే వారని, ఇప్పుడు 8 శాతానికి పరిమితం చేయడం దారుణమన్నారు. చిన్న రాష్ట్రంలో 13 ప్రైవేట్ వర్సిటీలు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతం చేస్తే పిల్లలను ప్రైవేట్ పంపాల్సిన అవసరం లేదన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ బడ్జెట్లో ఎక్కువగా రుణాలు, వడ్డీలు, జీత భత్యాలకే పోతే సంక్షేమం, అభివృద్ధి ఎలా అన్ని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ, వైద్య రంగాలకు అరకొర నిధులు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నేత డీజీ నర్సింహారావు, రైతు సంఘం సీనియర్ నేత సారంపలి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ తదితరులు పాల్గొన్నారు.