సిటీ బ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): మహానగరంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. జలమండలి పరిధి విస్తరించి మహా జలమండలిగా ఏర్పడిన నీటి సమస్యల్లో ఎలాంటి మార్పులు రాకపోగా.. పరిస్థితి మరింత దిగజారిపోతున్నది. అధికారులు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో పనులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రతిరోజు జలమండలి పరిధిలోని ఏదో ఒక ప్రాంతంలో తాగునీటి సమస్య ఏర్పడుతూనే ఉంది. జలమండలికి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ నీటి సరఫరాలో సమస్యలు నిత్యం ఉత్పన్నం అవుతుండటం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఏదో ఒకచోట తాగునీటిలో మురుగు కలువడం, దుర్వాసన వస్తుండటం నిత్యకృత్యంగా మారుతున్నది. మరోవైపు లోప్రెషర్ వేధిస్తున్నది.
కొన్ని ప్రాంతాల్లో తాగునీరు సరఫరా అయ్యేదే గంటా రెండు గంటలయితే ఆ సమయంలోనూ లోప్రెషర్‌తో రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు, లీకేజీలకు ఇక కొదవే లేకుండా పోతున్నది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటికి నగర ప్రజలు అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురించేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఎక్కడెక్కడా సమస్యలు తలెత్తుతున్నాయో గుర్తించి వాటిని పరిష్కరించి ఏప్రిల్, మే నెలల్లో నీటి సమస్య రాకుండా చూడాలని సూచిస్తున్నారు.
మురుగు, దుర్వాసన..
పలుచోట్ల తాగునీరు మురుగుమయంగా ఉండటం, దుర్వాసన వస్తుండటం నిత్య కృత్యంగా మారింది. ప్రజలు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన ఉండటం లేదు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో నీళ్లు ఉదయం 5.30 గంటల నుంచి 6.30 వరకు మాత్రమే సరఫరా అవుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు రంగు మారిన నీళ్లు సరఫరా అవుతూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. పది నిమిషాల తర్వాత నుంచి మంచి నీరు వస్తున్నా గంటలోపే సరఫరా నిలిచిపోతున్నదని ఆరోపిస్తున్నారు.
మురుగు నీరు రావడం, దుర్వాసన వస్తున్నదని అధికారులకు ఎన్నిస్లారు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇలా రోజుల తరబడి మురుగు నీటితో పాటు కేవలం గంట మాత్రమే సరఫరా అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగు మారి దుర్వాసన వస్తుండటంతో ఆ నీటిని వాడటం వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. అదే విధంగా కోకాపేటలో వారంలో రెండు మూడు రోజులకు ఒకసారి రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. కొద్ది సేపటి తర్వాత మళ్లీ శుభ్రమైన నీరు వస్తుందని పలు కాలనీల ప్రజలు చెబుతున్నారు.
లోప్రెషర్ సమస్య..
లోప్రషర్ సమస్య నగరంలోని చాలా చోట్ల వేధిస్తున్నది. లోప్రెషర్కు ప్రధాన కారణం క్షేత్రస్థాయి అధికారులు, లైన్మెన్లు విధుల్లో అలసత్వం వహించడమే కారణం అని సమాచారం. నగరంలోని చాలా కాలనీల్లో లైన్మెన్లు సకాలంలో నీటిని మళ్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని కాలనీలకు రెండు మూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని పలు కాలనీల్లో అర్ధరాత్రి దాటినాక నీటిని వదులుతున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
నందినగర్‌లో మూడు రోజులకోసారి సరఫరా చేస్తుండటంతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. జలమండలి ట్యాంకర్లు సైతం సకాలంలో రాకపోవడం వల్ల ప్రైవేట్‌గా వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. బస్తీ బాట పేరిట ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా జలమండలి తీరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని వినియోగదారులు మండిపడుతున్నారు. అధికారులు కాలనీల్లోకి వచ్చినప్పుడే హడావుడి చేస్తున్నారు కానీ ఆ తర్వాత క్షేత్రస్థాయి అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరగక ముం దే సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నాం
నల్లా నీళ్లు రెండు, మూడు రోజులకోసారి వస్తున్నాయి. అది ఒక గంట సేపు మాత్రమే రావడంతో సరిపోవడం లేదు. కొన్ని సార్లు గంట కంటే ఎక్కువ సేపు వచ్చినా లోప్రెషర్ కారణంగా సరిపోవడం లేదు. మా ఇంట్లో నలుగురం ఉంటేనే ఇలా ఉంటే.. ఎక్కువ మంది ఉన్న ఇంట్లో పరిస్థితి ఏంటి? చేసేదేమీ లేకపోవడంతో ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నాం. జలమండలి ఆఫీస్ నందినగర్ దగ్గరలోనే ఉన్నా బుక్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు సకాలంలో వచ్చినా ఎక్కువ సార్లు మరుసటి రోజు వస్తున్నది. జలమండలి అధికారులు బస్తీబాట పేరుతో సమస్యలు పరిష్కరిస్తున్నాం చెప్పుకుంటున్నా.. మా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.
– స్వరూప, నందినగర్