ఇంద్రవెల్లి/భైంసా టౌన్/పెంబి, ఏప్రిల్ 16 ః ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ సభలు గందరగోళం మధ్య కొనసాగాయి. సమస్యలు పరిష్కరించాలని అధికారులను సర్పంచ్‌లు, ప్రజలు నిలదీశారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌లు అధికారులను నిలదీశారు.
మండలంలోని కేస్లాపూర్, తేజాపూర్, ధోడంద, హర్కాపూర్తండా, ఏమాయికుంట సర్పంచ్‌లు మెస్రం తుకారామ్, కోవా రాజేశ్వర్, పవార్ చంగునదూదిరాం, రాథోడ్ రోహిదాస్, జాదవ్ లఖన్సింగ్లతోపాటు మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎండీ మసూద్, మిర్జా జిలానీబేగ్లు తాగునీటి, ఉపాధి హామీ పథకం సాంకేతిక సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, పీఆర్ శాఖలోని ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డు మంజూరు నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజల కోసం పనులు చేయాలని.. సర్పంచ్‌లు, నాయకులతో కలిసి సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అలాగే భైంసా మండలంలోని వానల్పాడ్ రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో ప్రదీప్‌ను సర్పంచ్‌లు నిలదీశారు.
ముందుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని, రంగు మారిన నీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారని ప్రశ్నించారు. మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. సభలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన సమావేశం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నది. పథకాల అమలుపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, రైతులు నిలదీశారు. సంక్షేమ పథకాలు, బోనస్, రైతుభరోసా రాకపోవడంపై అధికార, ప్రతిపక్షల నాయకుల మాధ్య మాటల యుద్ధం నెలకొన్నది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట సమావేశాలు నిర్వహిస్తున్నది. కొన్ని చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నా ప్రజలు రావడం లేదు. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలే అమలు చేయనప్పుడు.. మేం సమావేశాలకు వచ్చి ఏం ప్రయోజనం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో గురువారం పట్టణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు ప్రజలు రాకపోవడం పాలన తీరుకు అద్దం పడుతున్నది.
– నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్