మంచిర్యాల, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లోని శ్రీ కిరణ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం వైద్యం వికటించి మహారాష్ట్రలోని సిరోంచ తాలూక కారస్పల్లి గ్రామానికి చెందిన బాలింత రాపల్లి మంగ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. మంగకి డెలివరీ చేసిన డాక్టర్ అరుణశ్రీ ప్రభుత్వ వైద్యురాలు కావడం గమనార్హం.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)లో పీపీ యూనిట్ ఇన్చార్జి వైద్యురాలు. ఏ ప్రభుత్వ వైద్యురాలైన డ్యూటీ సరిగ్గా చేయాలి. సాయంత్రం డ్యూటీ తర్వాత మాత్రమే ప్రైవేట్ ప్రాక్టిస్ నడుపుకోవచ్చు. కానీ డాక్టర్ అరుణశ్రీ మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రైవేట్ క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు.
మరి పీపీ యూనిట్లో డ్యూటీలో ఎప్పుడు ఉంటారంటే.. ఏమైనా కేస్లు ఉన్నప్పుడు, లేదా మీటింగ్‌లు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి వెళ్తారట. వైద్యారోగ్య శాఖలో బాధ్యత గల వృత్తిలో పని చేయాల్సిన ఆమె వ్యవహారశైలి, ముందు నుంచి ఇంతేనని ఆమె పని చేసే ఆసుపత్రి వైద్యులు, సిబ్బందే స్వయంగా చెబుతున్నారు.
20 ఏళ్లుగా ఆ ఆసుపత్రిలోనే..
శ్రీ కిరణ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 20 ఏండ్లుగా ఈ మేడం పని చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఆమె భాగస్వామిగా ఉన్నట్లు తెలిసింది. వైద్యారోగ్యశాఖలో మెడికల్ ఆఫీసర్‌గా ఉన్నప్పటి నుంచి ఈ మేడం కిరణ్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. ఏది ఏమైనా.. 12 గంటలు కొట్టిందంటే చాలు ఇక్కడ వచ్చి వాలిపోతారు. ఇది ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే అయినా, అరుణశ్రీని అడిగే నాథుడే లేకుండా పోయారని కొందరు మండిపడుతున్నారు.
నిన్న వైద్యం వికటించి మృతి చెందిన బాలింతకు ఉదయం 6 గంటలకు ఈ డాక్టరే ఆపరేషన్ చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బాలింత పరిస్థితి విషమించినట్లు గుర్తించి హుటాహుటిన మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టం కొద్ది బాలింత మృతి చెందడంతో అసలు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరనేది.. అన్న విషయంపై దృష్టి పడింది. ఆరా తీయగా ఆమె ప్రభుత్వ వైద్యురాలని, డ్యూటీకి సరిగా వెళ్లదని, ప్రైవేటు ఆసుపత్రిలోనే ఎక్కువ సమయం గడుపుతారని తెలిసింది.
ఈ నేపథ్యంలోనే డాక్టర్ అరుణశ్రీ అని, ఆమె ప్రభుత్వ వైద్యురాలని తెలిసింది. నిబంధనల ప్రకారం డాక్టర్ అరుణశ్రీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంసీహెచ్ విధుల్లో ఉండాలి. కానీ మేడం మాత్రం ఏదైనా కేసులు ఉన్నప్పుడు, మీటింగ్‌లు ఉన్నప్పుడు మాత్రమే వస్తారని ఆమె సహచర వైద్యులు, సిబ్బంది చెబుతుండడం కొసమెరుపు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడుని వివరణ కోరగా.. ఏ డాక్టరైనా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండి తీరాలన్నారు. అరుణశ్రీ డ్యూటీ సరిగ్గా చేయదనే విషయం తమ దృష్టికి రాలేదన్నారు. అలాంటివేమైనా ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్..
వైద్యం వికటించి బాలింత మృతి చెందడంతో శ్రీ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఈ విషయాన్ని ఎలాగైనా బయటకు రాకుండా ఉంచేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే పోలీసు అధికారులకు ఆసుపత్రి నిర్వాహకులు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. అందుకే పోలీసు యంత్రాంగం మొత్తం సోమ వారం చెన్నూర్ నుంచి మంచిర్యాల వరకు పహారా కాచింది. ఆసుపత్రి ముందు బాధితురాలు బంధువులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలు చేయకుండా బలగాలను మోహరించారు.
సీఆర్పీఎఫ్ బలగాలను పెట్టి ఆసుపత్రి చుట్టు పక్కల ఎవరూ తిరగకుండా చూశారు. కా నీ అప్పటికే విషయం బయటకు పొక్కడంతో బాధితురాలి బంధువులతో యాజమాన్యం సెటిల్మెంటు చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆ కుటుంబానికి రూ. ఆరున్నర లక్షలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఆసుపత్రి నిర్వాహకుడు లక్ష్మణ్‌ను వివరణ కోరగా.. టూడీ ఎకో టెస్టు చేయకుండా ఆపరేషన్ చేయడంతో సమస్య వచ్చిందన్నారు.
మంగకి అంతకుముందే గుండె సంబంధిత సమస్య ఉందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. మంచిర్యాల ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గంమధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచిందని చెప్పారు. పోలీసు శాఖకు, బాధితులకు డబ్బులు ఇచ్చిన విషయంపై మాట్లాడటానికి ఇష్టపడలేదు. మొత్తం వ్యవహారంపై డాక్టర్ అరుణశ్రీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.