భైంసా, ఆగస్టు 22 : కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకే జీవో 97 తీసుకువచ్చిందని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ఆరోపించారు. శనివారం భైంసాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లో చేరాల్సిన పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ సంస్థ ఆధీనంలో నిర్వహించేందుకు పాలిటెక్నిక్‌ను విలీనం చేసేందుకు జీవో 97ను తీసుకువచ్చారని, శక్తి పేరుతో ఉన్న సంస్థ ద్వారా పాలిటెక్నిక్ విద్యను నడిపించాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. పాలిటెక్నిక్‌లో చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యకు వెళ్లాలంటే మళ్లీ ఇంటర్ ద్వారానే ఎంసెట్ పరీక్ష రాసి బిటెక్ చేయాల్సిందేనన్నారు. విద్యావిధానాల్లో మార్పులు తీసుకువచ్చేముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యా నిపుణులతో ప్రభుత్వం విస్తృతంగా చర్చించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే బీఆర్ఎస్ యువత తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 22 : జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అందించి పరిశ్రమలతో అనుసంధానంతో మెరుగైన ప్లేస్మెంట్ కల్పించాల్సింది పోయి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో శక్తి అనే విభాగంలో చేర్చి ఉన్నత విద్యను లక్షలాది మంది విద్యార్థులకు దూరం చేస్తున్నదని నిధులను దారి మళ్లించే ప్రయత్నాలకే ఈ ప్రభుత్వం పాటుపడుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.