Siddipet | సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తూ పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 20 ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఈ సమయంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. అత్యవసరంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే సంబంధిత ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరుతో వివిధ సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయాలని ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడటాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో భారీ శబ్దాలతో కూడిన డీజే సౌండ్ వినియోగంపైనా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కమిషనర్ తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అయిన సందర్భాల్లో సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 223, సిటీ పోలీస్ యాక్ట్, పోలీస్ యాక్ట్ 1861లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.