మంచిర్యాల, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో గడ్డం ఫ్యామిలీ-పీఎస్సార్ మధ్య వర్గపోరు ముదిరిపాకాన పడుతున్నది. అనేక పరిణామాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, ఆ సమయంలో ఎమ్మెల్యే పీఎస్సార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి’ అంటూ వ్యాఖ్యానించడం.. ఇందుకు వివేక్ వెంకటస్వామి స్పందించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
‘అవును ఆయన నియోజకవర్గంలో ఆయనదే నడుస్తున్నది. అలాగే బెల్లంపల్లిలో మా అన్న వినోద్ ఎమ్మెల్యే.. అక్కడ ఆయనదే నడుస్తున్నది. మంచిర్యాలలో పీఎస్సార్దే నడిచినప్పుడు.. మా అన్న ఎమ్మెల్యేగా ఉన్న బెల్లంపల్లిలో మాదే నడవాలి.. ఓరియంట్ ఎన్నికల్లో పీఎస్సార్ జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ అక్కడ జోక్యం చేసుకుంటే తాము మంచిర్యాల నియోజకవర్గంపై ఫోకస్ చేయాల్సి వస్తుంది.’ అంటూ మంత్రి పరోక్షంగా పీఎస్సార్‌ను హెచ్చరించారనే వార్తలు సైతం వచ్చాయి.
ఈ క్రమంలో ఓరియంట్ ఎన్నికల్లో సత్యపాల్‌రావు (మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ సోదరుడు) గెలుపొందగా, ముందే చెప్పినట్లు గడ్డం వివేక్ ఫ్యామిలీ మంచిర్యాల నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తున్నది. ఓరియంట్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో మంచిర్యాలలో రాజకీయ ప్రాబల్యం చాటుకునే పనిలో గడ్డం ఫ్యామిలీ నిమగ్నమైందనే చర్చ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
టార్గెట్ మంచిర్యాల.. భవిష్యత్తులో మరింత దూకుడు
ఓరియంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడాన్ని గడ్డం ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన దాదాపు రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, అనేక ఊహాగానాలకు వినిపిస్తున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచిర్యాలలో హాల్టింగ్ ఇచ్చిన సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ రాకున్నా.. మంత్రి వివేక్ హాజరయ్యారు.
ఎంపీ వంశీకృష్ణ వచ్చారంటే ఆయన ఎంపీ పార్లమెంట్ పరిధిలోకి మంచిర్యాల వస్తుంది. పైగా మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపాలని ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చారు. మరి మంత్రి వివేక్ ఎందుకు వచ్చారు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మంచిర్యాల జిల్లా పరిధిలోనే చెన్నూర్ నియోజకవర్గం ఉన్నందుకు వచ్చారనుకుందామంటే.. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు రాని ఆయన.. దీనికే ఎందుకు వచ్చారు అన్నది చర్చనీయాంశమవుతున్నది.
పైగా ఇదే రోజు మంచిర్యాలలో చెన్నూర్ నియోజకవర్గంపై రివ్యూ నిర్వహించారు. అనంతరం ఎంపీ ఫండ్స్ ఇచ్చిన ఓ కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవంలోనూ ఎంపీతో పాటు వివేక్ పాల్గొన్నారు. ఇదంతా ఏమిటి అన్నది జిల్లా కాంగ్రెస్‌లో రచ్చగా మారింది. వివేక్ వ్యవహారంపై పీఎస్సార్ వర్గం నాయకులు గుర్రుగా ఉంటే.. రానున్న రోజుల్లో మరింత దూకుడు పెంచుతామని వివేక్ వర్గం చెప్పుకుంటుంది. దీంతో మంచిర్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు తారా స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి క్రెడిట్ ఎవరికో..!
మంచిర్యాల ఫుట్ ఓవర్ బ్రిడ్జి డిమాండ్ చాలా రోజులుగా ఉంది. హమాలీవాడ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని స్థానికులు కోరుకుంటున్నారు. వందే భారత్ హాల్టింగ్ ప్రోగ్రామ్‌లో ఎంపీతో పాటు మంత్రి వివేక్ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ రూ.3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేస్తామని చెప్పారు. దీంతో మంజూరయ్యే ఫుట్ ఓవర్ బ్రిడ్జి క్రెడిట్ ఎవరి ఖాతాలో పడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇదే తరహాలో రానున్న రోజుల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇతర విషయాలపై గడ్డం ఫ్యామిలీ దృష్టి సారిస్తే.. పీఎస్సార్ వర్గానికి అది ఇబ్బంది కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తప్పదని, అదే జరిగితే పార్టీ నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకొని ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.