మంచిర్యాల, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్నందున, ఈ వ్యతిరేకత బయటపడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలకు తెరలేపింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఒక మహిళ సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీయగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను ముందుస్తుగా అరెస్టులను చేయించింది. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ఈ నిరసనలను పక్కన పెట్టి రేవంత్ సర్కారు ప్రజాపాలన పేరిట విజయోత్సవ సభలను నిర్వహిస్తున్నది.
ఈ సభల్లోనూ నిరసన వ్యక్తం అవుతుండడంతో సర్కారు తలలు పట్టుకుంటున్నది. ప్రజల నుంచి నిరసనలు రోజురోజుకు పెరుగుతుండగా.. సీఏం రేవంత్ సభలతోపాటు కాంగ్రెస్ నాయకుల పర్యటనలోను జనాల నుంచి వ్యతిరేకత ఎదురు అవుతుండడంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సభ పెద్దపల్లిలో ఉండగా బీఆర్ఎస్ నాయకులు సభకు వెళ్లకుండా ఉండేందుకు మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి వారి ఆధీనంలో ఉంచుకున్నారు.