తాండూర్/వాంకిడి/జన్నారం/వేమనపల్లి/దహెగాం/నెన్నెల/కన్నెపల్లి/చింతలమానేపల్లి/సిర్పూర్(టీ)/చెన్నూర్టౌన్/మందమర్రి రూరల్/కౌటాల/కెరమెరి/జైనూర్/ ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్/దండేపల్లి/ సిర్పూర్(యు)/బెజ్జూర్, సెప్టెంబర్ 2 : జిల్లాలో సోమవారం పొలాల అమావాస్య పండుగను ప్రజలు, రైతులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునే రైతులు తమ ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించారు. అనంతరం వాటిని పూలు, గజ్జెలు, వివిత వస్తువులతో అందంగా అలంకరించారు. హనుమాన్, పోచమ్మ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు.
వాటికి నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతులు ఇచ్చి, ఎడ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత గ్రామాల్లో ఊరేగించారు. పాడిపంటలు బాగుండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు. కాగా, పండుగకు వినియోగించే పాల ఆకులు, మక్క కంకులు, తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లలో ఉదయం సందడి నెలకొన్నది. వేమనపల్లిలోని విశ్వేశ్వర, జక్కెపల్లిలోని శివాలయం, జిల్లెడలోని మల్లికార్జున ఆలయం, కేతనలిపల్లిలోని శివాలయాలకు వెళ్లి పూజలు చేశారు. శ్రావణ మాసం చివరి రోజు కావడంతో భక్తులు ఆలయాల్లో పూజలు చేశారు.
సిర్పూర్(టీ) మండల కేంద్రలంలోని గంగాయిగూడ, న్యూ కాలనీ, శివపూర్, షేక్ అహ్మద్ గూడ, పాతట్లగూడ, తదితర కాలనీలకు చెందిన రైతులు తమ ఎడ్లతో శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయించారు. మందమర్రి మండలంలోని ఆదిల్పేట్లో గల హనుమాన్ ఆలయంలో మొకులు చెల్లించుకున్నారు. జైనూర్లో మాజీ ఎంపీపీ కుమ్ర తిరుమలవిశ్వనాథ్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, బీఆర్ఎస్ యువ నాయకులు సతీశ్ ముండే, మాజీ సర్పంచ్ మెస్రం రాహుల్, కుమ్ర శ్యామ్రావు, కొడప హన్నుపటేల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేస్రం అంబాజీరావు ఎడ్లకు పూజలు చేశారు. సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల్లో గ్రామ పటేలు ఆత్రం ఆనంద్రావ్, జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్రావ్, రైతులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.