PM Kisan samman nidhi | ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ..’ అన్నట్టుగా ఉన్నది.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తీరు.. రాష్ట్ర రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం.. సాయాన్ని మాత్రం అరకొరగానే అందిస్తున్నది. రాష్ట్ర సర్కారు మాత్రం నిరాటంకంగా పథకాన్ని అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఎకరాకు పదేండ్లుగా ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తుండగా.. నాలుగేండ్లుగా మోదీ సర్కారు ఐదెకరాల లోపు భూమి ఉన్న వారికే ఎకరాకు రూ.6 వేలు మూడు విడుతలుగా అందిస్తున్నది. ఆ డబ్బులు కూడా ఎప్పుడు ఖాతాలో వేస్తారో తెలియని దుస్థితి. రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంటే.. నిబంధనల కొర్రీలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ యోజనలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ)
నాకు కజ్జర్లలో రెండెకరాలు ఉంది. ఐదేండ్ల సంది ఏటా రాష్ట్ర సర్కారోళ్లు రైతుబంధు కింద పెట్టుబడికి డబ్బులు ఇస్తన్రు. గిప్పటికీ పదిసార్లు ఏటా ఎకరాకు రూ.10వేల సొప్పున పైసలిచ్చిన్రు. మొదట్ల చెక్కులిచ్చేటోళ్లు. తర్వాత నా ఖాతాలోనే పైసలేస్తున్రు. కరక్టు పంట మొదలయ్యే పది రోజుల ముందే డబ్బులు ఖాతాలో పడేటివి. కానీ కేంద్ర సర్కారోళ్లిస్తున్న డబ్బులు రెండేండ్ల సంది రావట్లే. ఆఫీసర్లను అడిగితే ఆధార్, బ్యాంక్ పుస్తకం ఇవ్వమన్నరు.ఇచ్చినా పైసలు రాలే.
– కజ్జర్ల (తలమడుగు మండలం)