ఆదిలాబాద్ : గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) , ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. పీఎం జన్మన్ యోజన పథకం (PM Janman Yojana) అమలుపై గురువారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఛాంబర్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులను గుర్తించి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించే దిశగా ప్రారంభించారని చెప్పారు. వచ్చే ఏడాది వరకు ఈ కార్యక్రమాన్ని అమలులో ఉంటుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం( Houses ) , రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల (Anganwadi Centres) ఏర్పాటుపై చర్చించారు.
మల్టీపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 22 మల్టీ పర్పస్ సెంటర్లు మంజూరు కాగా అందులో 4 మల్టీ పర్పస్ సెంటర్లు పూర్తి చేశామని వెల్లడించారు. విద్యుత్ లేని గ్రామాలను గుర్తించి సర్వే చేసి , నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.