
ఇచ్చోడ, డిసెంబర్ 6 : మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోకుండా యావత్తు దేశం గర్వించేలా క్రీడాకారులు ఎదగాలని, క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఇచ్చోడలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో మూడు రోజులుగా కొనసాగిన రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీలకు బోథ్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం నగదు, బహుమతులతో ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారిలో ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారిని వెలికితీసేందుకు సీనియర్ సాఫ్ట్‌బాల్ రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షుడు అనిల్ జాదవ్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
రాష్ట్ర చాంపియన్ హైదరాబాద్..
గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో మూడు రోజులుగా కొనసాగిన పోటీల్లో రాష్ట్రంలోని ఇరవై జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఫైనల్లో హైదరాబాద్, వరంగల్ అర్బన్ జట్లు తలపడ్డాయి. ట్రోఫీ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. వరంగల్ అర్బన్‌పై హైదరాబాద్ జట్టు పైచేయి సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. విజేతకు ఎమ్మెల్యే ట్రోఫీతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. రన్నరప్ వరంగల్ అర్బన్, తృతీయ స్థానంలో నిలిచిన మహబూబాబాద్ జట్ల కెప్టెన్లకు ట్రోఫీతో పాటు ప్రశంసాపత్రాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ జాదవ్, ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి గంగాధర్, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, మేరాజ్ అహ్మద్, పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఆయా జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకా రులు పాల్గొన్నారు.