ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ రంగు పురుగు(పింక్బౌల్) నివారణకు వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరిగింది. ప్రస్తుతం పత్తి పంట ఏపుగా పెరుగుతుండగా.. కాయలు కాసే దశ రావడంతో గులాబీ రంగు పురుగు సోకే ప్రమాదం ఉంది. పింక్బౌల్ కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. లింగాకర్షక బుట్టలను వినియోగించి పత్తి పంటకు నష్టం జరగకుండాచూసుకోవాలని సూచిస్తున్నారు.
ఆదిలాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తి పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది ఈ పంట పండించిన రైతులు మంచి లాభాలు గడించారు. క్వింటాకు రూ.12 వేల ధర చెల్లించి, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు అనుకూలించండంతో రైతులు ఆశలు పెట్టుకున్నారు. జూలై రెండో వారంలో భారీ వర్షాల కారణంగా 50 వేల ఎకరాల వరకు పంట నష్టపోవాల్సి వచ్చింది. కాయతొలుచు పురుగుల వల్ల రైతులకు మరింత నష్టం జరుగకుండా వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పంట కాయ కాసే దశలో ఉండడంతో గులాబీరంగు పురుగు వచ్చే ప్రమాదం ఉంది. ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో పింక్బౌల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేత ఆకుల కింద, లేత మొగ్గలు, కాయలపై తల్లి పురుగు గుడ్లు పెడుతుంది. దీని జీవితకాలం 45 రోజులు. కాగా, గుడ్ల నుంచి పిల్ల పురుగులు మొగ్గల్లోకి చొచ్చుకుపోతాయి. చిన్న లార్వాలు కాయకు కనిపించనంత రంధ్రాలు చేసి లోనికి ప్రవేశిస్తాయి. లోపలి పదార్థాలను తిని కాయలో ఏమీ లేకుండా చేస్తాయి. పింక్బౌల్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన
ఈ పురుగు ప్రభావం చూపకుండా వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, పింక్బౌల్ సోకిందనే విషయాలను గమనిస్తున్నారు. ఈ ప్రమదాన్ని ఎలా గుర్తించాలో తెలియజేస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, వాటిలో పది కంటే ఎక్కువగా తల్లి పురుగులు పడితే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు..
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటలో గులాబీరంగు పురుగు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు తమ పంటలో పింక్బౌల్ను ఎలా గుర్తించాలనే విషయాలను తెలియజేస్తున్నాం. పురుగు ప్రభావం కనపడితే పంటను కాపాడుకునేందుకు సస్యరక్షణ చర్యలు తెలియజేస్తాం.