మంచిర్యాల, మార్చి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి వంద శాతం పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభావిత, లబ్ధిదారులు తక్కువ సంఖ్యలో ఉండే చిన్న గ్రామాలను ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సర్కారు ఎంపిక చేసిన పైలెట్ గ్రామాలు సమస్యల విలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అమలు చేయాల్సిన పథకాలు ఏమో గానీ కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు పెదవి విరుస్తున్నారు.
కొన్ని పైలెట్ గ్రామాల్లో అంతర్గత రోడ్లు, రాకపోకలు సాగించేందుకు సరైన రహదారులు లేవు. ఇక గతంలో కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు నడిపే పరిస్థితి లేక పలు గ్రామాల్లో మూలన పడ్డాయి. చెత్త సెగ్రిగేషన్ షెడ్లు ఉపయోగంలో లేవు. పారిశుధ్య నిర్వహణ అసలే లేక అధ్వానపు పరిస్థితులు నెలకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యా ప్తంగా సోమవారం ‘నమస్తే తెలంగాణ’ విజిట్‌లో దా దాపు అన్ని పైలెట్ గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి.
శత శాతం.. అగమ్య గోచరం..
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన మేరకు రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ పైలెట్ గ్రామాల్లో 100 శాతం అమలు కావాలి. చాలా గ్రామా ల్లో ఎంత మందికి వచ్చిందనే వివరాలు అధికారులు చెప్పలేకపోతున్నారు. మరోవైపు అర్హులైన వారిని కాదని తమకు కావాల్సిన వారినే ఎంపిక చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కాసిపేట మండలంలో పైలెట్ గ్రామమైన బుగ్గగూడెంలో ట్రాలీ ఉందని చెప్పి ఇందిర మ్మ ఇండ్ల పథకానికి ఎంపిక చేయలేదని ఓ మహిళ వా పోయారు. డ్వాక్రా బుణం తీసుకుని ట్రాలీ నడుపుకుం టూ గూన ఇంట్లో ఉండే తాము ఇంటికి ఎలా అర్హులమయ్యాయో, పక్కా ఇల్లు, ట్రాలీ ఉన్నవారు ఇందిరమ్మ ఇంటికి ఎలా ఎంపికయ్యారో చెప్పాలంటూ సదరు మ హిళ వాపోయింది. కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గ్రామం లో అంతర్గత రోడ్లు నిర్మాణం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామ పంచాయితీ ట్రాక్టర్ రిపేర్ వచ్చి మూలకు పడిపోగా ఆ ట్రాక్టర్ రిపేర్ షెడ్డుకు చేరి సంవత్సరాలు దాటుతున్న పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీంతో ఆ ట్రాక్టర్ ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. గ్రామ పంచాయతీ ట్రాలీ కూడా రోడ్డు పక్కన పడిపోయి నిరుపయోగంగా మారింది. డంపింగ్ యార్డు కొన్ని నెలలుగా వినియోగంలో లేక బీటలు వారి శిథిలావస్థకు చేరింది. జన్నారం మండలంలో కొత్తపేట గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్లు కూడా లేవు. రేషన్ కార్డులకు ఎంపిక చేసిన వారికి ఇప్పటిదాకా బియ్యం సరఫరా చేయలేదని లబ్ధిదారులు చెప్తున్నారు. గ్రామంలోని డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిరుపయోగంగా మారాయి. వేసవి నేపథ్యంలో గ్రామంలో తాగునీటికి ఇబ్బంది అవుతుందని, ఇప్పుడున్న బోరుకు అదనంగా మరో బోరు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలా పైలెట్ గ్రామాలనే కాకుండా దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
గూన పెంకుల ఇంట్లో ఉంటున్నా.. ఎంపిక చేయలేదు..
మా ఊరును పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కావాలని మేము దరఖాస్తు చేసుకున్నాం. నేను గూన పెంకుల ఇంట్లో ఉంటున్న మాకు ట్రాలీ ఉందని ఇందిరమ్మ ఇంటికి ఎంపిక చేయలేదు. ఆ ట్రాలీ కూడా డ్వాక్రా రుణం తీసుకుని కొనుకున్నా. అలాంటప్పుడు మేము ఎలా అనర్హులం అవుతాం. మా ఇంటిని మీరే చూడండి. మాకు ఇల్లు ఇవ్వకుండా పక్కా ఇండ్లు, సొంత ట్రాలీలు ఉన్నోళ్లను ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదు. మాలాంటి వారికి న్యాయం చేయాలి.
– భీమిని రాజేశ్వరి, బుగ్గగూడెం.
బియ్యం ఇయ్యాలే..
రేషన్‌కార్డు ఇస్తున్నట్లు పత్రాలు ఇచ్చారు. బియ్యం ఇవ్వడం లేదు. అలాంటప్పుడు రేషన్‌కార్డులు ఇచ్చి ఏం లాభం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్తగా పత్రాలు ఇచ్చిన వారందరికీ బియ్యం ఇచ్చేలా చూడాలి. రోడ్డు సౌకర్యం లేక మా గూడెం వాసులందరం ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలంలో బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తుంది. పైలెట్ గ్రామం చేసిన మా ఊరుకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.
– శాంత, కోలాంగూడ, కొత్తపేట.