నార్నూర్ : వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతోనే ( Environmental hygiene ) సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జితేందర్ రెడ్డి (Jitender Reddy) అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ తండా,నాగల్ కొండ గ్రామాలలో వైద్య శిబిరం నిర్వహించారు. అవసరం ఉన్నవారికి రక్త పరీక్షలు, మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో నీళ్ల విరోచనాలు, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ వైద్య శిబిరంలో ఆరోగ్య విస్తరణ అధికారి తులసీదాస్, ఆరోగ్య పర్యవేక్షకులు చరణ్ దాస్, వైద్య సిబ్బంది శ్యామ్ కా, జవహార్ లాల్, గోకుల్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.