ఎదులాపురం/భీంపూర్, నవంబర్ 16 : ఎటుచూసినా గులాబీమయమే. సభాప్రాంగణం నిండిపోగా బయట కూడా సీఎం కేసీఆర్ సందేశం వినడానికి ఎండలో గంటల పాటు ప్రజలు నిరీక్షించారు. ఆదిలాబాద్‌లోని డైట్ మైదానంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించాల్సిన ప్రజా ఆశీర్వాద సభ రెండు గంటలు ఆలస్యమైనా పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి ఎండలోనూ ఓపికగా నిరీక్షించారు. పట్టణంలోని వాడలు, నియోకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డప్పువాయిద్యాలతో వచ్చారు.
సభలో వరంగల్‌కు చెందిన మిట్టు సురేందర్ బృందం పాటలు చైతన్యం కలిగించాయి . సీఎం కేసీఆర్ తెలుగు, హిందీ, ఉర్దూ, గోండి భాషలో మాట్లాడారు. సందిర్కున్ రాంరాం అని గోండి భాషలో సీఎం కేసీఆర్ అభివాదం చేయగా ఆదివాసీ జనం సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సభలోకి నాలుగు ద్వారాల ద్వారా అన్ని తనిఖీలు చేసి మరి పంపారు.
సీఎం కేసీఆర్ తన సందేశంలో ఎమ్మెల్యే జోగు రామన్న పని తీరును మెచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాను ఎమ్మెల్యేగా జోగు రామన్న ఎంతో అభివృద్ధి చేశారన్నారు. రామన్న చాలా ఉత్తమమైన వ్యక్తి అని, సామాన్యుడిలా ఉంటారని ఆయనపై నమ్మకంతోనే ఉదయమే ఆయన ఇంటివద్ద జనం జాతరలా ఉంటుందని అన్నారు. రామన్న తనతో పోట్లాడి జిల్లాకు వ్యవసాయ ,ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకువచ్చారన్నారు. మరోసారి జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని అప్పుడు జిల్లా మరింత బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. సభ విజయవంతమైంది.
ఎదులాపురం ,నవంబర్ 16 : సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.05 గంటలకు ఆదిలాబాద్ ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ల్యాండింగ్ అయ్యారు. హెలిప్యాడ్‌లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, వేణుగోపాలాచారిలకు ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న, ప్రముఖ హోమియోపతి వైద్యుడు, వైకుంఠట్రస్టు చైర్మన్ డాక్టర్ కాడిగిరి రవికిరణ్యాదవ్ స్వాగతం పలికారు. తర్వాత సభాస్థలికి 2.15కు చేరుకున్నారు. 2.21కి కేసీఆర్ ప్రసంగం ప్రారంభమైంది. 2.44 వరకు అంటే 26 నిమిషాలు ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రతి మాటకూ జనం స్పందిస్తూ కరతాళధ్వనులు చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ ఇందిరాప్రియదర్శిని స్టేడియంకు రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇచ్చోడకు వెళ్లారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 16 : ఆదిలాబాద్‌లోని డైట్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కొండ గంగాధర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.