తాండూర్ : ప్రజలు తమ ఓటు ( Vote ) హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ (ACP Ravikumar) తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభద్ర కాలనీ, బుధవారం అంగడీ బజార్, రాజీవ్ నగర్ కాలనీ, ఐబీ అండర్ బ్రిడ్జి, మేజర్ తాండూర్ గ్రామపంచాయతీతో పాటు పలు గ్రామాలలో అధికారులు, పోలీసు సిబ్బందితో సోమవారం ఫ్లాగ్ మార్చ్ ( Flogmarch ) నిర్వహించారు.
ప్రజలకు పోలీస్ లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పిస్తూ, చట్టం, శాంతి భద్రతపై భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎన్నికలలో ఎలాంటి అక్రమాలు, డబ్బు పంపిణీలు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి ఓటు విలువైనదని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లోనుకాకుండా పోలింగ్ స్టేషన్కు రావడమే పోలీసుల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, తహసీల్దార్ జోత్స్న, ఎంపీడీవో శ్రీనివాస్, తాండూర్, మాదారం, కన్నెపల్లి, భీమిని ఎస్సైలు కిరణ్ కుమార్, సౌజన్య, భాస్కర్ రావు, విజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.