కన్నెపల్లి/వేమనపల్లి, డిసెంబర్ 4 : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఆనందాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు కనిపించగా, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం ఉదయం అటవీ అధికారులు అక్కడికి చేరుకొని పెద్దపులి అడుగులేనని నిర్ధారించారు. ఆనందాపూర్, మెట్పల్లి, నాయుడుపేట, లింగాల, జక్కపల్లి, నాగారాం, సూరారం, బుయ్యారం, బొమ్మెన తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుష్నపల్లి ఎఫ్ఆర్వో దయాకర్ హెచ్చరించారు.
ఇక వేమనపల్లి సరిహద్దు గ్రామాలైన జక్కెపల్లి, జిల్లెడ, బుయ్యారం, బమ్మెన, నాగారం, సూరారం గ్రామాల వైపు పులి వచ్చే పరిస్థితి ఉందని, ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని, అటవీ శివారులోని పంట పొలాలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని కుష్నపల్లి ఫారెస్టు రేంజర్ దయాకర్ సూచించారు. జక్కెపల్లిలో గురువారం అధికారులు అవగాహన కల్పించారు. పులికి ఎలాంటి హాని చేయవద్దని, దాని జాడ కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ పులి కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిందని, అడవిలోని సీసీ కెమెరాలకు కూడా చిక్కలేదని ఆయన పేర్కొన్నారు.