కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ) మహారాష్ట్రలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలోని కెరమెరి మండలానికి చెందిన 12 గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో ఓటు హకు వినియోగించుకుంటున్నారు. గత గత నవంబర్ నుంచి 4 ఎన్నికల్లో ఓట్లు వేశారు. ఈ గ్రామాల్లోని ఓటర్లకు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ ఐడీ కార్డులు ఉండడంతో రెండు చోట్ల ఓటు వేస్తున్నారు.
పరందోళి, నోరేవాడ, బోలాపటార్, అంతాపూర్ పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ఈ గ్రామాల్లో 3,597 మంది ఓటర్లు ఉన్నారు. పరందోళి పోలింగ్ కేంద్రం పరిధిలో పరందోళి, తండా, కోటా, శంకర్ లొద్ది, లేండిజాల, ముక్దంగూడ, గ్రామాలు, నోకేవాడ పోలింగ్ కేంద్రం పరిధిలో మహారాజ్ గూడ, బోలాపటార్ పోలింగ్ పరిధిలో బోలాపటార్, గౌరి, లేండిగూడ, అంతాపూర్ గ్రామాల పోలింగ్ కేంద్రం పరిధిలో నారాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్, అంతపూర్ గ్రామాల ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హకు వినియోగించుకుంటున్నారు.
గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటు హకు వినియోగించుకోగా..ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు మహారాష్ట్రలో ఎంపీ స్థానానికి జరిగిన ఎన్ని కల్లోనూ ఓటు వేశారు. బుధవారం మహారాష్ట్ర అసెం బ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఓట్లు వేయడంతో పాటు తెలంగాణ- మహారాష్ట్ర రెండు రాష్ర్టాలకు సంబంధించిన సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్నారు.