ఇంటింటా సంక్షేమ వికాసం వెల్లివిరుస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని స్వర్ణయుగంగా మార్చగా.. తొమ్మిదేండ్ల కాలంలో 400లకుపైగా పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మంచిర్యాల జిల్లా ప్రగతి నివేదన సభా వేదికగా నాలుగు అద్భుత పథకాలకు అంకురార్పణ చేశారు. కులవృత్తులు బాగుండాలని రూ.లక్ష సాయం.. గొల్ల, కుర్మలు ఆర్థికంగా ఎదగాలని రెండో విడుత పంపిణీ.. దివ్యాంగులకు రూ.4,116లు.. నిరుపేదలకు ఇండ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సభా సాక్షిగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులు కూడా అందించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ఆయా వర్గాల ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
– మంచిర్యాల, జూన్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల కేంద్రంగా కుల వృత్తులకు రూ. ఒక లక్ష సాయం, రెండో విడుత గొర్రెల పంపిణీతోపాటు నిరుపేదలకు ఇండ్ల పట్టాలను సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా అందచేసి ప్రారంభించారు. నిరాదరణకు గురవుతున్న బీసీ కులాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. కుల వృత్తులకు ప్రభుత్వం చేయూతను కల్పించేందుకు నూతనంగా రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించి ప్రారంభించగా, ఈ పథకంపై బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సాయంతో కుల వృత్తులకు పూర్వవైభవం రానుందని పేర్కొంటున్నారు. వీటితో యాదవులకు రెండో విడుత గొర్రెల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడంపై యాదవ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడుతలో యాదవులకు తెలంగాణ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయగా, యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం అందరికి అందాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం చేపట్టగా యాదవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలను అందచేయడంపై నిరుపేదలు ఆనందంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సంక్షేమ పథకాల ఫలాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాండూర్, జూన్ 10 :నా పేరు ఆవుల వెంకటేశ్. మాది తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామం. మా అయ్య జమానాలో మాకు మస్తు గొర్రెలుండేవి. రోగాలచ్చి అవ్వి చనిపోయినయ్. ఎవుసం చేసుకుందామంటే గుంటెడు జాగ కూడా లేకుండే. ఇగ అప్పటి నుంచి నేను.. నా భార్య కూలీ పనికి పోతున్నం. పొద్దంత కష్టపడితే బట్టకు.. పొట్టకే అయితంది. ఇగ పిల్లలు.. మేము ఎట్లా బతుకుడోనని మస్తు రందయ్యేది. గింతల్నే సీఎం కేసీఆర్ సార్ గొల్ల కురుమలకు సబ్సిడీ మీద గొర్రెలు ఇస్తండని మావోళ్లు చెబితే దరఖాస్తు పెట్టుకున్న. డీడీ కూడా తీసిన. రెండో విడుతలో నా పేరు వచ్చింది. శుక్రవారం మంచిర్యాలల సీఎం సార్ నాకు చెక్కు ఇచ్చిండు. గీ పైసలతోటి మంచిగ గొర్రెలు కొనుక్కుంట. కష్టపడి కాసుకుంట. ఎట్లనైనా పెంపు చేసుకుంట. ఇగ నా కాళ్ల మీద నేను నిలబడతా. బిడ్డ అంజలి, కొడుకు ప్రణీత్‌ను మంచిగ సదివిచ్చుకుంట. మా బతుక్కి భరోసానిచ్చిన సీఎం సారు సల్లంగుండాలే.
తాండూర్, జూన్ 10 : నాకు భార్య, ఇద్దరు పిల్లలు. ఇది వరకు పూట గడవడం కోసం అష్టకష్టాలు పడ్డం. సూద్దామంటే పైసలు కనిపించకపోయేటివి. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయినంక రూ. 500 ఉన్న పింఛన్‌ను రూ. 1500కు పెంచిండు. మళ్లా 2018 ఎలక్షన్ల ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 3016 పెంచి మా బతుకులకు భరోసానిచ్చిండు. గిప్పుడు మళ్లా రూ. 4016కు పెంచుతున్నమని చెప్పిండు. మంచిర్యాల బహిరంగ సభలో మాట ఇచ్చిండు. ఇందుకు మస్తు సంతోషంగా ఉంది. మా బాధలు తెలిసిన మనసున్న మా రాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌సార్. గీ పింఛన్ డబ్బులు మా కుటుంబానికి ఎంతో అక్కరకు వస్తయి. దేవునోలె ఆదుకుంటున్న సీఎం సార్‌కు జీవితాంతం రుణపడి ఉంట.
– ఎండీ సలీం, దివ్యాంగుడు, తాండూరు ఐబీ
ప్రభుత్వం అందించిన గొర్రెల యూనిట్ మా భవిష్యత్‌కు భరోసానిచ్చిందని పాతబెల్లంపల్లికి చెందిన బొలవేని ఓదెలు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభలో రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కు అందుకున్న ఓదెలును ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా,తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు. – బెల్లంపల్లి రూరల్, జూన్ 10
నమస్తే : ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉంది?
బొలవేని ఓదెలు : ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇది వరకున్న సర్కారోళ్లు ఒకటీ.. రెండు పథకాలిచ్చి చేతులు దులుపుకునేటోళ్లు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకులు బాగుపడ్డయ్. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి ఇచ్చి పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నడు రైతు బీమా తీసుకొచ్చి రైతుల కుటుంబాలకు భరోసానిస్తున్నడు. రైతుబంధు కింద ఎకరానికి రూ. 10 వేల చొప్పున అందిస్తున్నడు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నడు. దీనికి తోడు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నడు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్లకుర్మల బతుకులకు దారి చూపిండు.
నమస్తే : సర్కారు అందించిన సాయంతో మీరెలా ఉపాధి పొందాలని భావిస్తున్నారు?
బొలవేని ఓదెలు :బీసీ కులానికి చెందిన నా కుటుంబానికి ప్రభుత్వం గొర్రెల యూనిట్ మంజూరు చేసింది. రూ. 1,75,000 యూనిట్‌కు నా వాటా కింద రూ. 43,750 ముందుగానే చెల్లించిన. సబ్సిడీ కింద చెల్లించే రూ.1,31,250 చెక్కును సీఎం కేసీఆర్ సారు నాకు స్వయంగా ఇచ్చిండు. ఇందుకు సంతోషంగా ఉంది. ప్రభుత్వం పెద్ద మనసుతో అందించిన సాయంతో 21 గొర్రెలు కొనుక్కుంట. నేను 26 ఏళ్లుగా బర్రె పాల వ్యాపారం చేస్తున్నా. పాల వ్యాపారంలో నాకున్న అనుభవంతో గొర్రెలను పెంచి పాల వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుంట. బర్రెల పోషణకంటే గొర్రెలు పెంచడమే సులువు. ప్రభుత్వం అందించిన గొర్రెలను అభివృద్ధి చేసుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంట. మందను పెంచి మగ గొర్రెలను అమ్మి ఆర్థికంగా నిలదొక్కుకుంట.
నమస్తే : ప్రస్తుతం పాల వ్యాపారంతో లాభాలు అర్జించవచ్చా?
బొలవేని ఓదెలు : కల్తీ లేని పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నేను రోజూ 30 లీటర్ల పాలు బెల్లంపల్లికి అమ్మేందుకు తీసుకెళ్తున్న. లీటర్ పాలకు రూ. 80 వరకు ధర వస్తుంది. పాలు చిక్కగా ఉంటే రూ. 100 కూడా ఇస్తరు. కష్టపడితే మంచి లాభాలు పొందవచ్చు. నేను 26 ఏళ్లుగా పాలవ్యాపారం చేస్తూనే కుటుంబాన్ని పోషించుకుంటున్న. నా ఇద్దరు పిల్లల్ని డిగ్రీ వరకు చదివించుకుంటున్న. ఇంటిదగ్గర నా భార్య, పిల్లలు నాకు సాయపడడం వల్లే ఈ వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్న. ప్రభుత్వం అందించిన సాయంతో పాల వ్యాపారాన్ని మరింత పెంపొందించుకుంట. మా భవిష్యత్‌కు భరోసానిచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంట.
గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు (నాగన్న) పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా అరిగెల ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
– ఆసిఫాబాద్, జూన్10
నమస్తే : రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల అభ్యున్నతికి ఎలాంటి కార్యక్రమలు చేపడుతున్నది ?
నాగన్న : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గొల్ల కురుమలకు ఉపాధి కల్పించే సదుద్దేశంతో 2017లో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు మంచిర్యాల సభలో రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
నమస్తే : గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడుతలో ఎంత మంది లబ్ధిపొందారు? ప్రస్తుతం వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి?
నాగన్న : జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 2902 యూనిట్లు అందించడం జరిగింది. దాదాపు 3 లక్షలకుపైగా గొర్ల ఉత్పత్తి పెరిగింది. గొల్ల కురుమలు స్వయం ఉపాధి పొందడమేగాక ఆర్థికంగా ఎదుగుతున్నారు.
నమస్తే : మొదటి విడుత యూనిట్‌కు, రెండో విడుత యూనిట్‌కు ఏమైనా తేడా ఉందా? రాయితీ ఎంత వస్తుంది?
నాగన్న : ప్రభుత్వం మొదటి విడుతలో ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షలు కేటాయించగా, రెండో విడుతలో రూ. 1.75 లక్షలు అందిస్తున్నది. దాదాపు రూ. 50 వేలు పెంచింది. ఒక్కో యూనిట్‌కు లబ్ధిదారుడు 25శాతం చెల్లించాల్సి ఉంటుంది.
నమస్తే : గొర్రెల యూనిట్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారా? యూనిట్ల ఎంపికకు ఎలాంటి నిబంధనలున్నాయి?
నాగన్న : గొర్రెల పంపిణీ పథకంలో అందించిన గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు రూ.5 వేల ఇన్సూరెన్స్ ఇస్తుంది. పొట్టేలుకు రూ. 7 వేలు అందిస్తుంది. 10 రోజుల్లోనే డబ్బులను లబ్ధిదారుడి ఖాతాల్లో జమ చేస్తున్నది. 18 ఏళ్లు పైబడిన యాదవులు, కురుమలు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ స్కీమ్ కింది మొబైల్ వెటర్నరీ యూనిట్లను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా రోగాలబారిన పడ్డ గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు.
‘మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో 25 ఏండ్లుగా హెయిర్ సెలూన్ నడుపుతున్నా. నా తండ్రి మామిడి రామయ్య కూడా 45 ఏండ్లుగా కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 50 ఏండ్లుగా రాష్ర్టాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు ఇతర పార్టీలు పరిపాలించాయి. ఏ పార్టీ కూడా తమకు లబ్ధి చేకూర్చలేదు. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూత నిస్తున్నాడు.’ అని మామిడి సత్యనారాయణ తెలిపాడు. ఈయనను ‘నమస్తే’ పలకరించగా పలు విషయాలు వెల్లడించాడు.
– భీమారం, జూన్ 10
నమస్తే : సీఎం చేతుల మీదుగా చెక్కు అందుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
సత్యనారాయణ : కులవృత్తిదారులకు సీఎం కేసీఆర్ సర్కారు రూ. ఒక లక్ష ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించగానే సంతోషించా. మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నా. మంచిర్యాల నుంచి కాల్ వచ్చింది. మీకు కులవృత్తి పథకం కింద రూ.ఒక లక్ష మంజూరయ్యాయని చెప్పారు. చాలా సంతోషమనిపించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కు ఇచ్చారు. కులవృత్తులను గౌరవిస్తున్నది కేసీఆర్ మాత్రమే అని చెప్పవచ్చు.
నమస్తే : ఏ ప్రభుత్వంలో అయినా సాయం అందిందా?
సత్యనారాయణ : దాదాపు ఏడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం నుంచి మాకు సాయం అందలేదు. మా తండ్రి రామయ్య 45 ఏండ్లుగా కులవృత్తినే నమ్ముకుని బతుకుతున్నాడు. నేను గత 24 ఏండ్లుగా ఇదే కులవృత్తిలో ఉన్న ఒక్క రూపాయి సహాయం కూడా అందలేదు. కులవృత్తులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సారు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం.
నమస్తే : మీకు ఏఏ రకాల సాయం అందుతోంది?
సత్యనారాయణ : తెలంగాణ సర్కారు నాయీ బ్రాహ్మణులకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నది. ఇప్పుడు మా కుల వృత్తులకు రూ.లక్ష సహాయం అందిస్తున్నారు. ఈ డబ్బులను సద్వినియోగం చేసుకొని మా జీవితాల్లో వెలుగులు నింపుకుంటాము.
నమస్తే : సారిచ్చిన సాయంతో ఏం చేస్తారు?
సత్యనారాయణ : సీఎం కేసీఆర్ సారు రూ.ఒక లక్ష రూపాయల చెక్కు అందించారు. ఇంతకుముందు మా తండ్రి నడుపుతున్న సెలూన్ డబ్బాలో ఉంది. పాతది కావడంతో తక్కువ గిరాకీ ఉంది. సార్ ఇచ్చిన డబ్బులతో నూతన హంగులతో సెలూన్ తయారు చేసుకుంటా. కుర్చీలు, గ్లాస్లు, సేవింగ్ మిషన్ కొనుగోలు చేస్తా. గిరాకీ మంచిగా అవుతుందని అనుకుంటున్నా.