సారంగాపూర్, మార్చి 10 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ఈ నెల 31 వరకు చెల్లించాలని డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పోలీస్ సిబ్బంది ఈ-చలాన్ ద్వారా జరిమానాలు విధించారని తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురువుతన్న విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి చలాన్లపై రాయితీని ప్రకటించారన్నారు. టూ, త్రీ వీలర్ వాహనాలపై 75 శాతం, ఫోర్ వీలర్, హెవీ వాహనాలపై 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, టీఎస్ఆన్లైన్, మీ సేవ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 4,23,073 కేసులకు గాను రూ.18,67,26, 235 వాహనదారులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నెల చివరి వరకు చలాన్ డబ్బులు చెల్లించాలని సూచించారు. పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించిన ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ అని పేర్కొన్నారు. అడెల్లి పోచమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులు మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి పాల్గొన్నారు.