ఉట్నూర్, జూన్ 17 : గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలో రూ.40 లక్షలతో కుమ్రం భీం పీనట్ చిక్కి(పల్లిపట్టి) ఇండస్ట్రీస్‌ను నెలకొల్పింది. 2020 సంవత్సరంలో తొమ్మిది మంది గిరిజనులను ఒక సంఘంగా ఏర్పాటు చేసి యూనిట్‌ను అప్పగించారు. వీరితోపాటు మరో పది మందికి ఉపాధి లభించింది. అయితే ఒకప్పుడు లక్షలాది ఆడర్లతో బిజీగా ఉన్న చిక్కి యూనిట్ యేడాదిగా మూగబోయింది. ఆ యూనిట్‌ను నడిపిన సభ్యులు మళ్లీ ఉపాధి దూరమై కూలీ పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
చిక్కి యూనిట్లో తయారైన పల్లిపట్టిని జీసీసీ ద్వారా ఐటీడీఏ కొనుగోలు చేసి ఆదివాసులలో అత్యంత వెనుకబడిన పీవీటీజీలకు అంగన్వాడీ గిరిపోషణ పథకం ద్వారా అందించేవారు. రక్తహీనతకు ఇప్పలడ్డుతో పల్లిపట్టీని ఇచ్చేవారు. అలాగే బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం(కేసీఆర్ కిట్) ద్వారా అందించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం ద్వారా ఆర్డర్లు రావడంలేదు. దీంతో బయటి మార్కెట్‌కు పోలేక చితికిలపడిపోయాయి. సంవత్సరకాలంగా మిషన్లు నిలిచిపోయాయి.
నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పరిశ్రమను ఏర్పాటు చేశాయి. అయితే దానికి తగ్గట్టు సంవత్సరానికి అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే గిరిపోషణ్ పథకానికి సుమారు క్వింటాలు వరకు పల్లిపట్టీలు, బాలింతలకు, గర్భిణులకు అందించేందుకు కేసీఆర్ కిట్లకు క్వింటాలు వరకు ఉత్పత్తి చేసి సరఫరా చేసేవారు. దీనికి తొమ్మిది మంది సంఘం సభ్యులు, మరో తొమ్మిది మంది కార్మికులు, ఇద్దర్ టెక్నీషియన్లు ఉపాధి పొందేవారు. వీరికి దాదాపు సంవత్సరంలో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు టర్నోవర్ అయ్యేది. వచ్చిన లాభాలను సభ్యులు పంచుకొనేవారు. అయితే యూనిట్ ఆగిపోవడంతో కూలీ పని చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరతతో పరిశ్రమ మూతపడే అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే ఐటీడీఏకు సరఫరా చేస్తూనే బయటి మార్కెట్‌కు పంపిస్తే ఉపాధి అవకాశాలు పెరిగేవని గిరిజన పెద్దలు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా బయటి మార్కెట్‌ను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు.
ఆర్లర్డు లేక సుమారు సంవత్సరంగా యూనిట్ ఆగింది. సంవత్సరానికి రూ.40లక్షల నుంచి రూ.50 లక్షల వరకు టర్నోవర్ చేసినం. 200 క్వింటాళ్ల వరకు గిరిపోషణ్, కేసీఆర్ కిట్ పథకాలకు అందించినం. అయితే ఇప్పుడు ఆర్లర్డు రావడం లేదు. అధికారులను అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. కనీసం తమ పాత బకాయిలు ఇస్తే బయటి మార్కెట్ కన్న పల్లిపట్టి తయారు చేసి అమ్ముకొని పాత రోజుల లాగా మళ్లీ 20 మందిమి ఉపాధి పొందుతాం. పల్లిపట్టి తయారు లేక ఉపాధి లేక చాలా మంది మహిళా సభ్యులు కూలీ పనులకు పోతున్నరు. -తిలక్, సభ్యుడు, ఉట్నూర్.
మాకు ఉపాధి కల్పించాలనే 2020 సంవత్సరంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.40 లక్షలతో పీనట్ చిక్కి ఇండ్రస్టీస్ను ఏర్పాటు చేశారు. దీనికి తొమ్మిది మందితో కలిసి ఒక సంఘం ఏర్పాటు చేశారు. అందరం కలిసి పల్లిపట్టి తయారు చేయాలి. ఐటీడీఏనే కొనుగోలు చేసి మళ్లీ డబ్బులు ఇచ్చేది. వచ్చిన డబ్బులను పంచుకునేటోళ్లం. మొత్తం యూనిట్ మీద 20 మంది వరకు ఉపాధి పొందినం. ఇక ఆర్లర్డు రాక పోయేసరికి నడపలేకపోతున్నం. ఐటీడీఏ నుంచి ఇంకా కొంత డబ్బులు రావాల్సి ఉంది.
-ఆత్రం మాధవ్, సభ్యుడు, ఉట్నూర్.