మంచిర్యాల అర్బన్, మార్చి 1 : ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పక్షుల ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (ఎన్సీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవ్వాల్ బర్డ్స్ ఫెస్టివల్ (పక్షి మహోత్పవం) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పక్షులు ఎంతో జీవవైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్నాయన్నారు. పక్షుల సంరక్షణకు, వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఇలాంటి బర్డ్స్ ఫెస్టివల్ వర్ షాప్లు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. పక్షుల సంరక్షణ ఒక హాబీగా చేసుకోవాలని, ఇందుకోసం కార్పొరేట్ కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కాకులు చాలా వరకు అంతరించిపోయాయని, కాకి కనపడితే ఒక ఆశ్చర్యంగా చూసే రోజులు వచ్చాయని పేరొన్నారు. రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను దసరా పర్వదినాల్లో బంధించి చూడడం నేరమన్నారు.
పతంగుల కోసం వాడే మాంజా దారంతో ఎన్నో పక్షులు చనిపోతున్నాయని తెఎలిపారు. కొన్ని రకాల పక్షులు వేటగాళ్ల బారిన పడి అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో సంచరించే వివిధ రకాల పక్షులతో కూడిన బ్రోచర్ ను విడుదల చేశారు. అనంతరం వర్ షాప్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పక్షుల వివరాలను, వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి పాత్రపై పక్షుల పై పరిశోధనలపై ప్రముఖులు వివరించారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, సీసీఎఫ్ శరవణన్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల డీఎఫ్వవోలు శివ్ఆశిష్సింగ్, నీరజ్ కుమార్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్డ్స్ స్టడీస్ (రిషివాలీ) డాక్టర్ శాంతారామ్, వెట్ ల్యాండ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ గుజ్జా భిక్షం, బర్డ్స్ మైగ్రేషన్ స్టడీస్ ప్రముఖులు డాక్టర్ సాతియా సెల్వం బీఎన్హెచ్ఎస్, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఎన్జీవో సీతారాం రెడ్డి, బర్డ్ బయో జియోగ్రఫీ ప్రముఖులు డాక్టర్ రాబిన్ విజయన్, మంచిర్యాల ఎఫ్డీవో సర్వేశ్వర్ రావు, వరల్డ్ వైల్డ్ లైఫ్ అధికారులు ఫరిదా తంపాల్, బండి రాజశేఖర్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు, అటవీ శాఖ అధికారులు, అటవీ కళాశాల (ములుగు) విద్యార్థులు, స్థానిక పాఠశాలల టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అటవీ ప్రాంతంలో వివిధ రకాల పక్షులను సందర్శించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. పక్షులు అడవులను పెంపొందించడంతో పాటు వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న పురుగులను, కీటకాలను పక్షులు తిని పంట పొలాలను రక్షిస్తాయి. దాని ద్వారా మనకు మంచి ఆహారం దొరుకుతుంది. వాతావరణంలో వస్తున్న మార్పులతో పక్షులు అంతరించిపోతున్నాయి. పక్షుల సంరక్షణతో మానవ మనుగడ సాధ్యమవుతుంది. పక్షులకు ప్రతి ఒక్కరూ తాగునీరు, ఆహారం అందించాలి.
అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్ కార్యక్రమానికి మమ్మల్నీ ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఉదయాన్నే బర్డ్ వాక్ వెళ్లి రకరకాల పక్షులను చూశాం. న్యాచురల్ ఫారెస్ట్ కు వచ్చి ఇక్కడ ఉన్న మేధావులతో కలిసి కొత్త విషయాలు నేర్చుకోవడం, పక్షులు వివిధ ఏరియాల్లో తీసుకునే ఆహారం, వాటి ఎదుగుదల వంటి విషయాలను తెలుసుకున్నాము. ఈ అవకాశం కల్పించిన అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు.