దండేపల్లి, ఆగస్టు 12 : ఆర్వోఎఫ్ఆర్ చట్ట ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించి జీవనాధారం కల్పిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గిరిజనుల సమస్యలపై జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
కొంతమంది గిరిజనులు అటవీ భూములను ఆక్రమిస్తూ పోడు పట్టాలు అడుగుతున్నారని, షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన హక్కుల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నదని, చేపట్టబోయే చర్యల గురించి అటవీశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు.
అర్హులైన గిరిజనులకు అటవీభూములలో వెదురు సాగు చేసేలా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. గిరిజనులు పోడు పేరిట అడవుల్లో చెట్లు నరకడం నేరమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, సీఐ రమణమూర్తి, ఎస్ఐలు తహసినొద్దీన్, సురేశ్, అనూష, ఎఫ్ఆర్వో సుష్మారావు, డీఆర్వో సాగరిక, సిబ్బంది ఉన్నారు.
హక్కు పత్రాలు ఇవ్వాలి : గిరిజనుల డిమాండ్
అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న తమకు హక్కు పత్రాలని ఇవ్వాలని ఆదివాసీ గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నామన్నారు. హక్కు పత్రాలు ఇచ్చే వరకూ పోరాటం ఆపేది లేదన్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ విషయంలో తమకు న్యాయం చేయాలన్నారు. 2004 కంటే ముందు నుంచి తాము పోడులో ఉన్నామన్నారు.