నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ప్రగతికి మంత్రి రామన్న బాసటగా నిలుస్తున్నారు. సెప్టెంబర్ 26న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి విద్యాలయాన్ని కలియదిరిగిన ఆయన, సమస్యలు తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి మరోసారి వచ్చి 36 మందికి గోల్డ్‌మెడల్స్, 576 మందికి పట్టాలు, 2,200 మందికి ల్యాప్‌టాప్‌లు, 1500 మందికి డెస్క్‌టాప్‌లు, షూలు, యూనిఫాంలు అందజేశారు. అదనపు డిజిటల్ తరగతి గదులు, సోలార్ ప్లాంట్, ఐటీసీసీ, సైన్స్ ల్యాబ్‌ల తదితర వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కేవలం రెండున్నర నెలల్లోనే అడ్మినిస్ట్రేషన్ పరంగా అనేక మార్పులు తీసుకురావడంతోపాటు విద్యాలయాన్ని హైటెక్ సొబగులతో తీర్చిదిద్దుతున్నారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాననే భరోసాతో విద్యార్థిలోకం ఆనందం వ్యక్తం చేస్తున్నది.
– బాసర, డిసెంబర్ 13
బాసర, డిసెంబర్ 13 : బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జేయూకేటీ)కి ఐటీ శాఖ మంత్రి రామన్న బాసటగా నిలుస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన ఆయన, సెప్టెంబర్ 26న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ట్రిపుల్ ఐటీని సందర్శించారు. మూడు గంటలపాటు విద్యాలయంలో కలియదిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఆ రోజు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు.
శనివారం నిర్వహించిన ఐదో స్నాతకోత్సవానికి మరోసారి వచ్చిన ఆయన, 36 మందికి గోల్డ్‌మెడల్స్, 576 మందికి పట్టాలు, 2,200 మందికి ల్యాప్‌టాప్‌లు, 1,500 మందికి డెస్క్‌టాప్‌లు అందజేశారు. అదనపు డిజిటల్ తరగతి గదులు, సోలార్ ప్లాంట్, సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రెండున్నర నెలల్లోనే అనేక మార్పులు తీసుకురాగా, విద్యార్థులతోపాటు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేరెంట్స్‌తో సమావేశం
వారంలో ఒకరోజు వీసీ, డైరెక్టర్ పేరెంట్స్ కమిటీతో సమావేశమై సమస్యలపై చర్చిస్తున్నారు.
సీఆర్లతో వీసీ, డైరెక్టర్ సమావేశం
ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ ప్రతి పదిహేను రోజులకోసారి ఒక్కో బ్రాంచ్‌లోని సీఆర్(క్లాస్ రిప్రజంట్రేటర్)లతో సమావేశమై బోధనా అంశాలపై చర్చిస్తున్నారు.
మెస్‌లో వార్డెన్లు భోజనం చేసేలా..
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెస్ వార్డెన్లను నియమించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం లేదా రాత్రి మెస్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా షెడ్యూల్ రూపొందించారు. భోజన వసతి ఎలాగుందో తెలుసుకుంటున్నారు. డైరెక్టర్ కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. నాణ్యమైన సరుకులు వాడుతున్నారో లేదోనని స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌తో కలిసి స్టోర్రూంన
పరిశీలిస్తున్నారు.
మానసిక నిపుణులతో అవగాహన
విద్యార్థులకు అప్పుడప్పుడు మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.
మహిళా ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్ల నియామకం
ట్రిపుల్ ఐటీలో 70 శాతం మంది విద్యార్థినులు ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో మాట్లాడి మహిళా ఎస్ఐతోపాటు నలుగురు మహిళా కానిస్టేబుళ్లను నియమింపజేశారు. వీరు ట్రిపుల్‌ఐటీలోనే ఉండేలా ఏర్పాట్లు చేశారు.
మన ఆర్జీయూకేటీ – మన బాధ్యత
ట్రిపుల్‌ఐటీలో చెత్తాచెదారం పేరుకుపోయిందని, దీనిని పరిశుభ్రం చేసే బాధ్యత సిబ్బందితోపాటు విద్యార్థులకు కూడా ఉందని అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నెలకోసారి ‘మన ఆర్జీయూకేటీ – మాన బాధ్యత’ అనే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు విద్యార్థులు, టీచింగ్, నాన్‌టీచింగ్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
చెత్తాచెదారం కోసం ప్రత్యేక డంప్‌యార్డు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ట్రిపుల్ ఐటీలోని వసతి గృహాల్లో రోడ్లపై గల చెత్తను ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు. డంప్ యార్డులో వేసే విధంగా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రత్యేకంగా రెండు వాహనాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి డంప్‌యార్డులో పారవేస్తున్నారు.
బీమా చెల్లింపు. .
గతంలో కరోనా కారణంగా విద్యార్థుల బీమాను చెల్లించకపోవడంతో అధికారులు మూడు సంవత్సరాలకు సంబంధించిన బీమాను కంపెనీకి చెల్లించారు. ట్రిపుల్ ఐటీలో బడ్జెట్‌పై అవగాహన కలిగిన ఫైనాన్స్ ఆఫీసర్‌ను కొత్తగా నియమించారు.
వసతి గృహాల పర్యవేక్షణ
వసతి గృహాల్లో వార్డెన్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఫ్యాన్లు, ట్యూబ్‌లు పాడైతే కొత్తవి ఏర్పాటు చేయిస్తున్నారు. వాష్‌రూమ్‌లలో నీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నారు.
సీసీ కెమెరాలతో నిఘా..
276 ఎకరాల విస్తీర్ణంలోని ట్రిపుల్ ఐటీలో దాదాపు 200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో పని చేయని వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. మెయిన్ గేటు వద్ద నుంచి లోపలికి వచ్చే అపరిచిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
త్వరలో ప్రారంభోత్సవాలు
వచ్చే ఏప్రిల్ వరకు డాటా సెంటర్, సైన్స్ల్యాబ్స్, విద్యార్థినులకు వేడినీళ్లు అందించే సోలార్ ప్లాంట్లు, 24 డిజిటల్ తరగతుల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఆయన రూ.25 కోట్లు అవసరముంద ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అదనంగా మరో రూ.2 కోట్లు జోడించి, మొత్తం రూ. 27 కోట్లు మంజూరు చేశారు.
ఎకో పార్కు ప్రారంభం
ఇటీవల ట్రిపుల్ ఐటీలో ఎకో పార్కు పనులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రారంభించారు. నాలుగైదు నెలల్లో పార్కు పూర్తికానున్నది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆహ్లాదం పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థులకు కంటి పరీక్షలు
ఎల్వీ ప్రసాద్ దవాఖాన ఆధ్వర్యంలో దాదాపు 1,200 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
స్టడీ అవర్స్, 24గంటలు డిజిటల్ లైబ్రరీ
విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్‌ను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో కొనసాగిస్తున్నారు. 24 గంటల లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు బుక్స్ అందిస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.
నాణ్యమైన భోజనం అందించేందుకు టెండర్లు
ట్రిపుల్ ఐటీలో నాణ్యమైన భోజనం అందించేందుకు టెండర్లు వేశారు. మొదటిసారి ఎక్కువ బిట్స్ రాకపోవడంతో క్యాన్సిల్ చేశారు. ఇటీవల మళ్లీ టెండర్లు వేసినప్పటికీ దానికి కూడా ఎక్కువ మొత్తంలో టెండర్లు రాకపోవడంతో మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలపడంతో ఈ సమస్య కూడా పరిష్కారం అవ్వనున్నది.
కుర్చీలు వచ్చేశాయి..
సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీని సందర్శించిన మంత్రి కేటీఆర్ స్టూడెంట్ యాక్టివిటీ భవనంలో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులు కింద కూర్చొని ఉండడాన్ని గమనించిన మంత్రి కేటీఆర్ ఫిక్స్డ్ కుర్చీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 800 ఫిక్స్డ్ చేయిర్స్ను ఏర్పాటు చేశారు.
టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఆదేశాలు
ట్రిపుల్‌ఐటీలో పని చేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోరాదని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని డైరెక్టర్ సతీశ్‌కుమార్ హెచ్చరించారు.
పలు కంపెనీలతో ఎంవోయూ.
మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో టాస్క్ కంపెనీతో ఒప్పందం జరిగింది. ప్రముఖ కంపెనీలైన గ్లోబల్ లీడర్ పీపుల్ ఆపరేషన్స్, బోర్నెక్స్, కాకతీయ సౌండ్ బాక్స్, ఐటీఐ అండ్ సీ-డిపార్ట్మెంట్తో పాటు బాసరలోని మినీ టీ హాబ్ ఏర్పాటుకు టీ హబ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. డిచ్పెల్లిలోని తెలంగాణ యూనివర్సిటీతో కూడా ఒప్పందం కుదిరింది. ఇక్కడ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కల్పించనున్నారు.
హెల్త్ ప్రొఫైల్
కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయించి విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయించారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ ఉదయం, సాయంత్రం క్యాంపస్‌లో కలియదిరుగుతూ సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, షూలు, దుస్తులు
మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 10న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, షూలు, యూనిఫామ్స్ అందించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సిస్టం
ఆర్జీయూకేటీలో సాంకేతిక సొబగులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఆఫీస్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టం, హెచ్ఆర్ఎం మేనేజ్మెంట్, సెక్యూరిటీ గేట్ మేనేజ్మెంట్ సిస్టం, సర్వే మేనేజ్మెంట్ సిస్టం, కెరీర్స్ అండ్ రిక్రూట్మెంట్స్, గ్రీవెన్స్ రిడ్రెస్సల్సెల్, ఎగ్జామ్ మేనేజ్మెంట్, విద్యార్థుల పెండింగ్ ట్యూషన్ ఫీజు వివరాల కోసం ఫీజు మేనేజ్మెంట్, ఉద్యోగులు సెలవులు, అనుమతులకు ఎంప్లాయిస్ లీవ్ మేనేజ్మెంట్, విద్యార్థుల ఇండ్లకు, బయటకి వెళ్లేందుకు సెక్యూరిటీ గేట్ మేనేజ్మెంట్(ఔట్‌పాస్), డిజిటల్ నోటిసెస్(వెబ్, ఈమెయిల్, ఎస్, ఎం ఎస్) మేనేజ్మెంట్ స్సిస్టంవంటి సాంకేతికతను అమలు చేస్తున్నారు.
క్రీడా రంగానికి ప్రాధాన్యత
ట్రిపుల్ ఐటీలో రూ.5 కోట్లతో మినీ స్టేడియం నిర్మించాలని సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీకి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. దీంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరు నెలల్లో మినీ స్టేడియం నిర్మించనున్నారు. మొత్తం ఎనిమిది మంది పీడీ (ముగ్గురు మహిళలు)లను నియమించారు. ఉదయం, సాయంత్రం క్రీడలపై మెలకువలు నేర్పిస్తూ సామగ్రి అందిస్తున్నారు.
కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా..
చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా మెలకువలు నేర్పిస్తున్నారు. ప్రతి విభాగానికి ప్లేస్మెంట్ కో-ఆర్డినేటర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ద్వారా మెలకువలు నేర్పుతున్నారు. యేటా దాదాపు 70కి పైగా కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఈ ఏడాది మరిన్ని ఎక్కువగా కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
సుందరీకరణ దిశగా చెరువు
ట్రిపుల్ ఐటీలో దాదాపు 30 ఎకరాల్లో చెరువు ఉంది. గోదావరి నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా ఈ చెరువును నింపి ట్రిపుల్ ఐటీ కోసం వినియోగిస్తున్నారు. ప్రతిరోజూ 10 లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నారు. దాదాపు ఆరు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడు పాడైపోగా వాటిని రిపేర్ చేయించి తాగు నీటిని అందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తాగు నీరు అందించాలని సూచించారు. హెచ్ఎండీఏ సహకారంతో త్వరలో చెరువును సుందరీకరించనున్నారు.
వసతి గృహంలో బెడ్స్
నూతనంగా వచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 1,500 బెడ్స్ కొనుగోలు చేశారు. అదే విధంగా పీ1, పీ2 విద్యార్థులకు గతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డామ్స్లో తరగతులు జరుగుతుండేవి. వాటి పైకప్పులు ఊడి పోవడంతో ఏ,బీ-1 బ్లాక్‌లోకి తరగతి గదులను మార్చి విద్యనందిస్తున్నారు.
అడ్మినిస్ట్రేషన్‌పరంగా మార్పులు
ట్రిపుల్ ఐటీలో టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేర్పులు చేశారు. చీఫ్ వార్డెన్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్, అసోసియేట్ డీన్, అకాడమిక్ డీన్, ఫైనాన్స్ ఆఫీసర్‌తోపాటు హాస్టల్, మెస్ వార్డెన్లను నియమించారు. డిసిప్లేన్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ కమిటీలను నియమించి వారికి ఉత్తర్వులు జారీ చేశారు.
టీ హబ్ సందర్శించిన విద్యార్థులు
మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఇండస్ట్రీయల్ టూర్లో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత నెలలో హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు. అక్కడి ప్రొఫెసర్లు, కొన్ని కంపెనీల సీఈవోలను కలిసి మాట్లాడారు.
విద్యార్థుల క్షేమమే మా ధ్యేయం
ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల క్షేమమే మా ధ్యేయం. వారికి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని సూచించాం. నాతోపాటు డైరెక్టర్ ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్‌తోపాటు వసతి గృహాలను పర్యవేక్షిస్తున్నాం. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న ఐదారు నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తాం.
– వెంకటరమణ, ఇన్చార్జి వీసీ , ట్రిపుల్ఐటీ
నాణ్యమైన భోజనం అందుతుంది
మంత్రి కేటీఆర్ రెండునెలల క్రితం బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చాడు. మాతో కలిసి భోజనం చేశాడు. అప్పటి నుంచి నాణ్యమైన భోజనం అందుతుంది. ఇంకాస్త మెరుగుకావాల్సి ఉంది. మంత్రి కేటీఆర్‌పై మాకు నమ్మకం ఉంది.
– ఆర్ రక్షిత, ఎంఎంఈ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం
కేటీఆర్ అన్నలా వచ్చాడు..
బాసర ట్రిపుల్ ఐటీలో మూడేళ్లు గా చదువుకుంటు న్నా. ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ రెండో సం వత్సరం చదువుతున్న. రెండేళ్లుగా కరోనా వల్ల కళాశాలకు దూరం అయ్యా. అప్పటి నుంచి కొన్ని సమస్యలు మాకు ఎదురయ్యాయి. మంత్రి కేటీఆర్ అన్నలా వచ్చి మా అందరి సమస్యలు పరిష్కరించారు. ఇందుకు ఆనందంగా ఉంది.
– ఎం. అనుశ్రీ, సివిల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం
మెళకువలు నేర్పుతున్నాం
యూనివర్సిటీ అధికారులు మాకు ఎప్పటికప్పుడు మెలకువలు నేర్పుతున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తెలియజేయాలని సూచించారు. మంత్రి కేటీఆర్ వచ్చాక అనేక మార్పులు జరిగాయి. ఇక్కడున్న మౌలిక వసతులన్నీ వినియోగించుకుంటున్నాం.
– నితిన్ రాథోడ్, ట్రిపుల్-ఈ ద్వితీయ సంవత్సరం
మినీ టీ-హబ్ ఏర్పాటు చేస్తే..
బాసర ట్రిపుల్‌ఐటీలో మినీ టీ-హబ్ ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తే పలు కంపెనీల ద్వారా మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశముంటుంది.
– శ్రీనివాస్, సీఎస్సీ ద్వితీయ సంవత్సరం