నిర్మల్ అర్బన్, జూన్ 25 ః ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగిసింది. నిర్మల్ జిల్లాలో 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అధికారులు స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటా తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
కేవలం 1,641 మంది మాత్రమే చేరగా.. గతేడాది 3,661 మంది చేరారు. అంటే సగానికిపైగా తగ్గారు. ఉపాధ్యాయులు బడిబాటను నామమాత్రంగా నిర్వహించడంతోనే విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గిందని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా.. 1,641 మంది నూతన ఎన్రోల్మెంట్లో 817 మంది అంగన్వాడీల నుంచి సర్కారు బడిలోకి వచ్చారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 52 మంది, నేరుగా అడ్మిషన్ పొందిన వారు 187 మంది, ప్రైవేటు పాఠశాల నుంచి 479 మంది చేరారు. డ్రాపౌట్స్ అయిన 12 మంది కూడా పాఠశాలలో చేరారు.