కౌటాల, ఏప్రిల్ 9 : నిధుల కోసం పంచాయతీ పాలకవర్గం ‘పల్లె ప్ర కృతి వనం, మెగా ప్రకృతి వనం’లోని చెట్లు నరికివేసి అమ్ముకోవడంపై ఆ ఊరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామంలోని సర్వే నంబర్ 83/1లోని ఎకరంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అదే సర్వే నంబర్ లోని మూడెకరాల్లో మెగా ప్రకృతి వనం, 20 గుంటల్లో శ్మశానవాటిక ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి నవంలో 500 మొక్కలు, మెగా పల్లె ప్రకృతి వనంలో సుమారు 2 వేలు, శ్మశానవాటికలో 100 మొక్కలు నాటగా, ఆయాచోట్ల చెట్లు ఏపుగా పెరిగాయి.
నిధులు సరిపోక చెట్లు నరికి..
కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే నిధులు సరిపోపోవడం లేదని, ఈ చెట్లను నరికి నిధులు సమకూర్చుకునేందుకు ఫిబ్రవరి 3న గ్రామ సభలో పాలకవర్గం తీర్మానించింది. దీంతో దాదాపు 1500కు పైగా నీలగిరి చెట్లను నరికి వేశారు. రూ. లక్షకు విక్రయించారు. ఈ నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధికి వినియోగించామని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయం అధికారులకు కూడా తెలియజేశామని తెలిపారు.
పాలకవర్గంపై ఎంపీడీవోకు ఫిర్యాదు
నీలగిరి చెట్లను విక్రయించిన సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలని కనికి గ్రామస్తులు మంగళవారం ఎంపీడీవోకు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు గానీ, కనీసం పారిశుధ్య పనులుగాని చేయడం లేదని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారిలో గ్రామస్తులు శివరాం, భీంరావు, రోజా, రాంకుమార్, ఇస్తారి, విజయకాంత్,అశోక్, విశ్వనాథ్ తదితరులున్నారు.

Adilabad