నిర్మల్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో, కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యాలపై ఆ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను స్మరించుకుంటూ తప్పటడుగు వేశామన్న భావనలో ఉన్నారు. ఈ క్రమంలో తమ అసంతృప్తి, అసమ్మతిని వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. వారం పది రోజుల నుంచి ఈ చేరికలు, ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ దూసుకపోతున్నది.
ఐదారు నెలల క్రితం వరకు బీఆర్ఎస్లో నెలకొన్న స్తబ్దత క్రమంగా తొలగిపోతూ కొత్త ఉత్సాహం మొదలైంది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన చాలామంది నాయకులు వరుసకట్టి బీఆర్ఎస్లో చేరుతున్న కారణంగా ఆ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ భక్షీనాయక్ ఏకంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షాదివస్ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని సోమారిపేట్కు చెందిన మాజీ ఎంపీటీసీ బండారి పుష్ప బీఆర్ఎస్లో చేరారు.
సోమారిపేట్కే చెందిన వైద్యుడు లక్ష్మీరాజం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వీరంతా ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. నిర్మల్ నియోజకవర్గంలో.. మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన దేవోల్ల రాజ్‌కుమార్ బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇదే మండంలంలోని లింగంపెల్లికి చెందిన భీమ భూమన్న కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. దిమ్మదుర్తి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కే. రాజేశ్వర్‌గౌడ్, బీజేపీకి చెందిన కే. వినయ్‌గౌడ్, కృష్ణకాంత్ బీఆర్ఎస్లో చేరారు. దిలావర్పూర్ మండలంలోని కాల్వ నర్సింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ మహేశ్ కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. కాల్వ గ్రామానికే చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ బీఆర్ఎస్లో చేరారు. సిర్గాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేశ్వర్ ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. వీరంతా నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి నాటి నుంచి ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీ నాయకులు, కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ పరమైన కార్యక్రమాలను నియోజకవర్గంలో నిరాటంకంగా నిర్వహిస్తూ కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా పార్టీని జనానికి చేరువ చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు, పార్టీ పరమైన కార్యక్రమాలను గ్రామస్థాయిలో చేపడుతూ ఆయన పార్టీ ఉనికిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే అటు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను, బీజేపీలో పార్టీ నేతల నిర్లక్ష్యానికి గురవుతున్న కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన చాలామంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు వరుసపెట్టి బీఆర్ఎస్లో చేరుతున్నారు. జాన్సన్‌నాయక్ వీరందరినీ ఏకంగా పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లి కండువా కప్పిస్తున్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న అవినీతి అక్రమాలను వివరిస్తూ ఆయన బీఆర్ఎస్ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఆయన అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాన్నిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో గ్రామంలో చాలామంది బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. జాన్సన్‌నాయక్‌కు పార్టీ అధిష్టానంతో ఉన్న పరిచయాల కారణంగా పార్టీ కేడర్‌ను కష్టాల సమయంలో కూడా ఆదుకుంటూ వెన్నంటి నిలుస్తున్నారు.