కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సర్కారు.. ఊరూరా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పరిరక్షించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేని తనంతో అవి ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లన్నీ ఎండిపోయి ఎడారులను తలపిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువవ్వడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలుండగా, గత ప్రభుత్వం గ్రామానికొకటి చొప్పున పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేంది. గ్రామాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి ఎకరం నుంచి మూడెకరాల పరిధిలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు చల్లని వాతావరణం కోసం మొక్కలు నాటింది. చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో పాటు ప్లాట్‌ఫాంలు నిర్మించారు.
వాకింగ్ ట్రాక్‌ల పక్కన వేప, మర్రి, కానుగ, బాదం, దానిమ్మ, సీతాఫలం, నేరేడు తదితర పండ్లు, పూల మొక్కలు పెంచారు. చిన్నారులు ఆడుకోవడానికి పరికరాలు సైతం ఏర్పాటు చేశారు. స్థలాల్లో సహజంగా ఉన్న గుట్టలు, బండలపై జంతువులు, ఇతర అందమైన బొమ్మలు వేశారు. కానీ, ప్రభుత్వం మారడంతో అధికారులు పల్లె ప్రకృతి వనాలను పట్టించుకోవడం మానేశారు. గ్రామాలకు ప్రత్యేకంగా ట్రాక్టర్లు ఉన్నప్పటికీ పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు నీళ్లు పోయడం లేదు. దీంతో నాడు పచ్చగా కళకళలాడిని పల్లె ప్రకృతి వనాలు.. నేడు వెలవెల బోతున్నాయి.
‘తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలే..’ అనే సదుద్దేశంతో కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలకు ప్రాణం పోసింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా స్థలాలు కేటాయించి నర్సరీలు ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో యేటా 40 వేల మొక్కలు నాటింది.
వర్షాకాలం ప్రారంభంలోనే హరితహారం పండుగలా సాగేది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం కార్యక్రమం కనుమరుగవుతోంది. హరితహారం నర్సరీల నిర్వహణను ప్రభుత్వంతో పాటు అధికారులు గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోంది. సర్పంచులు లేకపోవడం.. గ్రామ పంచాయతీల పాలన ప్రత్యేకాధికారులకు అప్పగించడంతో నర్సరీల నిర్వహణ చూసేవారే లేకుండా పోయారు. నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు నియమించిన సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.