నిర్మల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కాంటాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘వడ్లు కొంటలేరు’ కథనానికి అధికారులు స్పందించారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లోని మార్కెట్ యార్డులో శుక్రవారం పలువురు రైతులకు సంబంధించిన వడ్లను తూకం వేశారు. లోకేశ్వరం, సారంగాపూర్ మండలాల్లోని పలు సెంటర్లలో తేమశాతం వచ్చిన వడ్లను కొనడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

వర్షాకాలంలో అధిక వర్షాలతో తిప్పలు పడ్డ రైతులకు పంట చేతికొచ్చే సమయంలో మొంథా తుఫాన్ మరింత ఇబ్బందులకు గురి చేసింది. ఈ క్రమంలో 15 రోజులుగా పంటను కాపాడుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులకు పంటను విక్రయించేందుకు ఎదురుచూపులు తప్పడంలేదు.
తేమ పేరుతో సెంటర్ల నిర్వాహకులు కాంటాలను ప్రారంభించకపోవడంతో పలు సెంటర్లలో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. దీంతో రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘వడ్లు కొంటలేరు’ కథనం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సెంటర్ల నిర్వాహకులతో చర్చలు జరిపిన సివిల్ సైప్లె అధికారులు వెంటనే కాంటాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆనందం వ్యక్తం చేసిన పలువురు రైతులు తమ ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.