హనుమకొండ చౌరస్తా : చేవేళ్ల డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళితులకు అంబేద్కర్ అభయ హస్తం ( Ambedkar Abhayahastam) రూ.12 లక్షలుఇస్తానని రెండున్నరేళ్లు గడిచినా ఇవ్వకుండా దళితులను మోసం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ( Tatikonda Rajaiah ) మండిపడ్డారు.
హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధుతో రాష్ట్రంలోని దళితులకు న్యాయం చేసిందని అన్నారు. దళితజాతి పక్షాన అంబేద్కర్ అభయహస్తం కోసం పోరాడుతాననని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ఎప్పుడూ ముందుంటుందని, దళితులకు అంబేద్కర్ అభయహస్తం రూ.12 లక్షలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించేంతవరకు రాష్ట్రంలో జరిగే ఎంహెచ్పీఎస్ ఉద్యమానికి వరంగల్ నుంచే ఉద్యమం మొదలవుతుందన్నారు.
ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెజ్ బోర్డు మాజీ ఛైర్మన్ జన్ను జఖార్య, కేయూ ఉద్యమనాయకుడు బొల్లికొండ వీరేందర్, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకె ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నం గోపి, కత్తి విష్ణు, వేల్పుల రాంకుమార్, బైరపాక జోజి, మంద ఆరోగ్యం, అన్వేష్, లక్ష్మణ్, తిరుపతి, బిక్కు రాజేశ్వర్, గాలి రాజు, వడ్డూరి రమేశ్, చంద్రగిరి, కృష్ణ, వేల్పుల నవీన్ పాల్గొన్నారు.