నార్నూర్ : వేతనాలు ( Salarie ) చెల్లించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తెలంగాణ ఆదర్శ పాఠశాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ( Boycott ) ప్రిన్సిపాల్ ప్రశాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆడే మహేందర్, సుద్దోధన్, సాయినాథ్, లాలూజి మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, గత ఐదు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. వేతనాలు రాకపోవడంతోనే విధులను బహిష్కరిస్తున్నామని ఉద్యోగులు పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఐదు నెలల వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.