కాసిపేట, జనవరి 17 : కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజశ్వరమ్మ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. మెజార్టీ నాలుగు యూనియన్ల తరుపున ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానీ గ్రూపులు కొనుగోలు చేయడంతో యాజమాన్యం మార్పు పక్రియ కొనసాగుతుండగా, ఎన్నికలు వాయిదా వేయాలని ఓరియంట్ యాజమాన్యం తరుపున అధికారులు కోరారు. ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ యూనియన్లు కోరాయి.
ఒక యూనియన్ ఉద్యోగుల సంతకాలతో కూడిన ప్రాతినిధ్య పత్రాలను సమర్పించారు. సమావేశానికి హాజరైన ఓరియంట్ సిమెంట్ పర్మినెంట్ వర్కర్స్ యూనియన్, ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్, ది లోకల్ ఓరియంట్ సిమెంట్స్ ఎంప్లాయిమెంట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు హాజరు కాగా, మెజార్టీ నాయకులు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఈ నెల 28న మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున తుది నిర్ణయం వెలువడే అవకాశమున్నది. ఇప్పటికే గుర్తింపు సంఘం ఎన్నికలు లేక మూడేళ్లు అవుతుండగా, ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ఓరియంట్ కార్మికులు కోరుతున్నారు.