కాసిపేట, జూలై 1 : కాసిపేట మండలంలో ని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు మళ్లీ తెరపైకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాలతో జూన్ 5న ఎన్నికలు ప్రకటిస్తారని అంతా అనుకున్నా.. డీసీఎల్ లేరనే సాకుతూ వాయిదా వేశారు. మళ్లీ ఇప్పుడు ఆదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ద్వారా కార్మిక యూనియన్లకు లేఖలు అందాయి. జూలై 8వ తేదీలోగా ఓటర్ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలపాలని అందులో పేర్కొన్నారు. దీంతో మళ్లీ ఎన్నికలపై కార్మికుల్లో ఆశ చిగురిస్తున్నది. కానీ, ఈ ఓటర్ లిస్ట్ ఫైనల్ చేశాకనైనా ఎన్నికల తేదీలను ప్రకటిస్తారా లేదా అనే దానిపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
ఎన్నికల వాయిదాకు వర్గ పోరే కారణమా..!
ఓరియంట్(అదానీ) సిమెంట్ కంపెనీ ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థులంతా కాంగ్రెస్ వారే కా వడం.. జిల్లాలోని ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు.. తదితర కారణాలవల్లే ఎన్నికలు వాయి దా పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. ఆయన ఎన్నికలను ముందుకు తీసుకువెళ్తారా లేదా అనేదానిపై కార్మికుల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రంరావును బరిలీ దించుతున్నట్లు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడ్మ బొజ్జు సంయుక్తంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సోదరుడు సత్యపాల్‌రావు అప్పటికే దేవాపూర్‌లో ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్సీ, మాజీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు రాములు నాయక్ కూడా ఎన్నికల బరిలో ఉంటున్నారు. వీరందరూ కాంగ్రెస్ క్యాడరే కావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు కోరుతున్నారు.