ఇచ్చోడ, ఫిబ్రవరి 6 : గ్రామంలో సేకరించిన చెత్త నుంచి సేంద్రి య ఎరువులు తయారు చేస్తూ ముక్రా (కే) గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్ సూచనలు పాటిస్తూ మండలంలోని సర్పంచ్, కార్యదర్శి చెత్త నుంచి సంపదను సృష్టించి వాతావరణాన్ని కాపాడడమే కాకుండా పంచాయతీకి ఆర్థిక వనరులు అందిస్తున్నారు. అంతేగాకుండా ప్రత్యేకంగా మేళాలు సైతం నిర్వహించి ఇప్పటికే మూడుసార్లు రైతులకు ఎరువులను విక్రయించారు.
ఇంటింటా సేకరణ
ట్రాక్టర్‌తో ఇంటింటా సేకరించిన చెత్తను డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువు తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2020 లో గ్రామ పంచాయతీలో డంప్ యార్డును నిర్మించింది. వీటిని పూర్తిస్థాయిలో వాడుకలోకి తీసుకువచ్చి ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహణ చేస్తున్న గ్రామపంచాయతీల్లో మండలంలోని ముక్రా (కే) గ్రామపంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఆదాయం రూ.4.50 లక్షలు కు పైగానే..
ముక్రా (కే) గ్రామంలో 202 ఇండ్లు ఉండగా, 904 మంది జనాభా ఉండగా, మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. ఏడాదిగా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా కంపోస్టు ఎరువును తయారు చేసి రైతులకు విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పటివరకు సుమారు 90,000 కేజీల సేంద్రియ ఎరువును తయారు చేసి విక్రయించగా పంచాయతీకి రూ. 4.5 లక్షల వరకు ఆదాయం వచ్చింది. కంపోస్ట్ పిట్స్ వేసిన తర్వాత ఎరువు తయారయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. ప్రతిరోజూ వచ్చిన చెత్త అలాగే మిగిలిపోతుండడంతో పంచాయతీ ద్వారా అదనపు పిట్స్ నిర్మించి వాటిలో కూడా ఎరువును తయారు చేస్తున్నారు. పంచాయతీ నుంచి గ్రీన్ అంబాసిడర్స్‌ను నియమించి ప్రతిరోజూ సర్పంచ్, కార్యదర్శి పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా ఘన వ్యర్థాల నిర్వహణ చేస్తూ జిల్లా, మండల స్థాయి అధికారుల మన్ననలు పొందుతున్నారు.
ప్రతిరోజూ చెత్త సేకరణ..
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తుంది. సేకరించిన చెత్తను నిత్యం డంప్ యార్డుకు తరలించేలా పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. వారి సహకారంతో గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం.
– గాడ్గే మీనాక్షి , సర్పంచ్, ముక్రా (కే)
ప్రత్యేక దృష్టి సారించాం..
గ్రామంలో సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలించిన తర్వాత తడి, పొడి చెత్తను వేరు చేయిస్తున్నాం. ఘనవ్యర్థాల నిర్వహణ అనేది సున్నితమైన అంశం. దీనిపై ప్రత్యేక దృష్టి సారించినందుకే మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రజలు కొంత అవగాహనతో తడి, పొడి చెత్తను ఇండ్లలోనే వేరు చేసి ఇస్తే ఘన వ్యర్థాల నిర్వహణ మరింత సులభమవుతుంది.
– సురేశ్ , ముక్రా (కే) పంచాయతీ కార్యదర్శి