నిర్మల్ టౌన్, ఆగస్టు 9 : రెవెన్యూశాఖలో పని చేస్తున్న వీఆర్ఏల సర్దుబాటులో మరో ముందడుగు పడింది. వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకనుగుణంగా నిర్ణయం తీసుకొని సర్దుబాటు ప్రక్రియను వేగవంతం చేశారు. రెవెన్యూశాఖలో గ్రామస్థాయిలో పని చేస్తున్న వీఆర్ఏలను ఇతర శాఖలకు బదలాయింపు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ ద్వారా జాబితాను అన్ని జిల్లాలకు పంపింది. నిర్మల్ జిల్లాలో 748 మంది వీఆర్ఏలు పని చేస్తుండగా.. 519 మందికి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసే జాబితా చేరినట్లు అధికారులు తెలిపారు. వీఆర్ఏలో డిగ్రీ ఉన్న వారికి రికార్డు అసిస్టెంట్, ఇంటర్ ఉన్న వారికి రికార్డు అసిస్టెంట్, పదో తరగతి ఉన్న వారికి అటెండర్, హెల్పర్, లస్కర్ పోస్టులను సృష్టించి ఆయా శాఖల్లో సర్దుబాటు చేయాలని కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. దీంతో 24 గంటల్లోనే వారికి శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో పని చేస్తున్న వీఆర్ఏలను వివిధశాఖలకు బదలాయింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టనుండడంతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
నిర్మల్ జిల్లాలోని వీఆర్ఏలను విద్యార్హతను బట్టి ఆరు శాఖల్లోనే సర్దుబాటు చేస్తూ సీసీఎల్ ద్వారా జాబితా వచ్చింది. దీంతో వారంతా కొత్త శాఖలకు వెళ్లనున్నారు. 519 మందికి పోస్టులను ఇవ్వనున్న నేపథ్యంలో అందులో ఎక్కువగా రెవెన్యూశాఖ, విద్యుత్‌శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, శిశు సంక్షేమ, నీటి పారుదలశాఖ, పశు సంవర్ధకశాఖ, మిషన్ భగీరథ, హెల్త్, జిల్లా పౌర సరఫరాలశాఖ, జిల్లా పౌర సంబంధాలశాఖ, బీసీ వెల్ఫేర్, గురుకులాల్లో వివిధ పోస్టులను కేటాయిస్తూ సీసీఎల్ జాబితాలో సర్దుబాటు చేస్తూ లిస్టు పంపింది. దీంతో ఉద్యోగులు ఇతర శాఖలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ప్రధానంగా రెవెన్యూశాఖలోనే ఎక్కువ మందిని సర్దుబాటు చేయగా.. విద్యార్హతను బట్టి జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, అటెండర్ పోస్టుల్లో నియమించనున్నారు.
మాది నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ గ్రామం. 11 ఏళ్ల నుంచి వీఆర్ఏగా నిర్మల్ రూరల్‌లో పని చేస్తున్నా. ఇప్పుడు వీఆర్ఏగా పని చేస్తున్నప్పటికీ రికార్డులన్నీ నేనే చూస్తున్నా. ఇప్పుడు నేను డిగ్రీ పట్టా కలిగి ఉండడంతో రెవెన్యూశాఖలోనే రికార్డు అసిస్టెంట్‌గా సర్దుబాటు చేస్తూ సీసీఎల్ఏ జాబితాలో నా పేరుంది. మాతృశాఖలోనే నన్ను సర్దుబాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.
– రాధ, వీఆర్ఏ, నిర్మల్ మండలం
నేను నిర్మల్ అర్బన్ తహసీల్ కార్యాలయంలో 11 ఏళ్లుగా పని చేస్తున్నా. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న తమకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వీఆర్ఏలను తొలగిస్తామన్నప్పుడు బాధ కలిగినా ముఖ్యమంత్రిపై భరోసా ఉండే. ఇప్పుడు నాకు మున్సిపల్‌శాఖలో రికార్డు అసిస్టెంట్‌గా సర్దుబాటు చేశారు.
– నిరోషా, వీఆర్ఏ, నిర్మల్
నేను 30 ఏళ్ల నుంచి రెవెన్యూశాఖలో పని చేస్తున్నా. వీఆర్ఏగా పని చేస్తున్నప్పటికీ కార్యాలయంలో కంప్యూటర్, ఇతర పనులు చేయడంతో పని మొత్తం వచ్చు. నాకు డిగ్రీ ఉండడంతో రెవెన్యూశాఖలోనే రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. కేసీఆర్ మా సేవలను గుర్తించి న్యాయం చేసి ఉద్యోగ భద్రత కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని జీవితంలోఒ మరిచిపోను.
– కిషన్, వీఆర్ఏ, నిర్మల్
సీసీఎల్ఏ నుంచి 11 గంటలకే సమాచారం వచ్చింది. రెవెన్యూశాఖలో 11 ఏళ్లుగా వీఆర్ఏగా పని చేస్తున్నా. తహసీల్దార్ ఏ పని చెప్పినా అది చేస్తూ మొత్తం నేర్చుకున్నా. నేను ఇంటర్ అర్హత కలిగి ఉండడంతో రెవెన్యూశాఖలోనే రికార్డు అసిస్టెంట్‌గా సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రేపో మాపో కొత్త ఉద్యోగం, కొత్త జీవితం ప్రారంభిస్తున్న. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని కుటుంబసభ్యులతో కలిసి సంబురాలు చేసుకున్నాం.
– చుంచు మౌనిక, వీఆర్ఏ, నిర్మల్