సుబేదారి, ఆగస్టు 14 : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్న బుకీ (ఏజెంట్)ను పోలీసులు పట్టుకొని రూ. 32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ కథనం ప్రకారం.. హనుమకొండ గోపాల్పూర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ క్రికెట్ బెట్టింగ్ బుకీ (ఏజెంట్)గా పని చేస్తూ, మహారాష్ట్రకు చెందిన సునీల్ సాయంతో బెట్టింగ్ నిర్వహించేవాడు. ఇద్దరు కలిసి www.nice7777.pro వెబ్సైట్ ద్వారా అమాయకులను నమ్మించి యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ చేసి 12 అకౌంట్ల ద్వారా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకునేవారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 100 బాల్స్ క్రికెట్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా, పక్కా సమాచారంతో ప్రసాద్‌ను పట్టుకొని నగదు, మూడు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని నిందితుడు ప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.