ఎదులాపురం, ఫిబ్రవరి 17 : ప్రజావాణికి చాలా మంది అధికారులు తను వచ్చిన తరువాత కూడా రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు. కలెక్టర్ హాజరై అర్జీలు స్వీకరిస్తున్నా.. ముఖ్యశాఖల అధికారులు డీఆర్డీవో పీడీ రవీందర్‌రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఏవో రాంరెడ్డికి ఫోన్ చేసి పిలిపించాలన్నారు. తర్వాత గ్రీవెన్స్‌కు వచ్చిన అధికారులు వారికి సంబంధించిన అర్జీలపై కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. అనంతరం అర్జీలదారుల సమస్యలను విన్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సోమవారం ఫిర్యాదుల విభాగంలో 69 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలి
పదో తరగతి ప్రత్యేక తరగతులపై మండల ప్రత్యేకాధికారులు రోజూ పర్యవేక్షించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు మండలాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతోపాటు మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్ అందించాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై దృష్టి సారించాలన్నారు. అభ్యాస దీపికలపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం జన్మన్ యోజన పథకం కింద చేపడుతున్న అంగన్వాడీ భవనాలు, కొత్త అంగన్వాడీ భవనాలు మంజూరైన వాటి నివేదికలు త్వరగా పంపాలని డీబ్ల్యూవోను ఆదేశించారు.